పాకిస్థాన్‌ పంతానికి పోతే ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియాలోనే?

ఛాంపియన్స్ ట్రోఫీ- 2025కు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్‌డౌన్ ప్రారంభం కావాల్సింది. షెడ్యూల్ కూడా విడుదల కావాల్సింది. అయితే.. ఒక్క కారణంతో ఆలస్యం కొనసాగుతూనే ఉంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్థాన్‌కు తాము వెళ్లబోమని.. ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌కు (ICC) స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి.. ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకు చెప్పి.. హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించాలని కోరింది. భారత్ మ్యాచ్‌ల్ని.. తటస్థ వేదికగా యూఏఈలో నిర్వహించాలని అడిగింది.

అయితే ఇక్కడే పాక్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. టోర్నీని తమ దేశంలోని నిర్వహించాలనే మొండి పట్టుదలతో.. హైబ్రిడ్ విధానానికి నిరాకరిస్తోంది. భారత్ రాకపోవడానికి కారణాల్ని లిఖితపూర్వకంగా వెల్లడించాలని అడుగుతోంది. గతేడాది ఆసియా కప్‌కు పాక్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు.. భారత్ మాత్రం ఈ మ్యాచ్‌ల్ని శ్రీలంకలోనే ఆడింది. ఈ క్రమంలో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం.. పాకిస్థాన్ వెనక్కి తగ్గట్లేదు.

ఇటీవల పాక్.. హైబ్రిడ్ మోడల్‌‌కు అంగీకరించకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకలో లేదా.. సౌతాఫ్రికాకు తరలించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి చర్చే జరగలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుంచి తప్పుకుంటే.. అప్పుడు భారత్‌లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు స్పోర్ట్స్ టాక్ అనే వెబ్‌సైట్ కథనం ప్రచురించింది. ఇక టోర్నీ నుంచి పాక్ తప్పుకుంటే .. అప్పుడు విశేష ఆదరణ ఉండే భారత్, పాక్ మ్యాచ్ జరగని పక్షంలో బ్రాడ్‌కాస్టర్స్‌కు ఐసీసీ పెద్ద మొత్తంలో నష్టపరిహారం కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం.

భారత్‌లో టోర్నీ నిర్వహణకు సంబంధించి చర్చలు ప్రాథమిక దశల్లోనే ఉన్నాయని.. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని స్పోర్ట్స్ టాక్ వెల్లడించింది. దీనిపై ఐసీసీ అధికారికంగా చెప్పేవరకు క్లారిటీ రాదని చెప్పొచ్చు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి పీసీబీకి మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. టోర్నీ నిర్వహణ నుంచి పాక్ తప్పుకుంటే.. అప్పుడు పాక్ బోర్డుకు అందించే నిధుల్లో ఐసీసీ కోత విధించే అవకాశం ఉంది. ఇంకా టోర్నీ మరో దేశానికి తరలించినా లేదా వాయిదా వేసినా కూడా ఆతిథ్య రుసుముల కింద పాక్‌కు దక్కాల్సిన దాదాపు రూ. 548 కోట్లు రాకుండా పోతాయని చెప్పొచ్చు.

About amaravatinews

Check Also

బుమ్రాను పొగుడుతూనే సిరాజ్ గాలి తీసిన ఆసీస్ స్పీడ్ స్టార్..

జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో భారత విజయాలకు ప్రధాన స్తంభంగా నిలిచాడు. బ్రెట్ లీ అతని ప్రతిభను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *