జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలు మరోసారి ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రస్తుతం పాక్‌లో శిక్షణ పొందిన 55 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో ఉన్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్రమూకల భరతం పట్టేందుకు భారత సైన్యం భారీ ఆపరేషన్‌కు వ్యూహరచన చేసింది. ఉగ్రవాదుల ఏరివేతకు ఇప్పటికే 500 మంది పారా కమాండోలను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. ఆ ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0 (Operation Sarp Vinaash 2.0)’ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. 21 ఏళ్ల తర్వాత కశ్మీర్ లోయలో ఆర్మీ చేపట్టిన అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఇదే.
ప్రధాన మంత్రి కార్యాలయం స్వయంగా ఈ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తోంది. ఈ ఆపరేషన్‌లోని ముఖ్య అధికారులు నేరుగా జాతీయ భద్రతా సలహాదారు, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. గడచిన 32 నెలల్లో జమ్మూలోని వివిధ చోట్ల జరిగిన ఉగ్రదాడుల్లో 48 మంది సైనికులు అమరులయ్యారు. ఆయా ఉగ్రదాడులు, వాటి వెనక ఉన్న కీలక ముష్కరుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేసిన ఆర్మీ… జవాన్లు త్యాగాలు వృథా కాకూడదన్న ఉద్దేశంతో ఈ భారీ ఆపరేషన్ చేపడుతోంది. అలాగే, తీవ్రవాదులదాడులతో భయం గుప్పిట్లోకి జారుకుంటోన్న సాధారణ పౌరుల్లో ధైర్యం నింపేందుకు ఇప్పటికే ఆర్మీ చర్యలు చేపట్టింది.
కీలక ప్రాంతాల్లో 200 మంది స్నైపర్లు, 500 మంది పారాకమాండోలతో కలిసి దాదాపు 4 వేల అదనపు బలగాలను మోహరించింది. దేశంలోని ఇతర భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ భారత సైన్యం ఆర్మీ ఈ ఆపరేషన్‌కు వ్యూహరచన చేసింది. ఇందులో స్థానికులను కూడా ఇందులో భాగస్వాములను చేయడం చెప్పుకోదగ్గ అంశం. 1995-2003 మధ్య జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంంలో కీలక పాత్ర పోషించిన విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ ( VDGs) సాయాన్ని కూడా సైన్యం కోరింది. స్థానిక పరిస్థితులు, ఎదురయ్యే సవాళ్ల గురించి వీరికి పూర్తి అవగాహన ఉంటుంది.
ఉగ్రవాదుల ఏరివేతతో పాటు వారికి సహకరిస్తోన్న నెట్‌వర్క్‌లను కూడా ఈ ఆపరేషన్ ద్వారా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉగ్రవాదులకు ఆహారం, ఆయుధాలు సమకూరుస్తూ, ఆశ్రయం కల్పిస్తూ క్షేత్రస్థాయిలో వారికి సహకరించే నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని ఇండియన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ ఆపరేషన్ జమ్ములోని దోడా, కథువా, ఉధంపుర్, రాజౌరీ, పూంచ్, రియాసీల్లో కొనసాగుతోందని ఆయన చెప్పారు.
హిట్ లిస్టులో ఉన్న 55 మంది ఉగ్రవాదులు ఈ ప్రాంతాల్లోనే సంచరిస్తున్నట్టు సమాచారం ఉందన్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అంతం చేయాలని, జమ్మూను ఉగ్రవాద కేంద్రంగా మార్చాలనుకుంటున్న పాక్ పన్నాగాన్ని భగ్నం చేయాలనే కృతనిశ్చయంతో భారత సైన్యం ఉందని పేర్కొన్నారు.
Amaravati News Navyandhra First Digital News Portal