వ్యాపార భాగస్వామిని హత్య చేసిందన్న ఆరోపణలతో యెమెన్ దేశం కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు ఊరిశిక్షి పడిన విషయం తెలిసిందే.. మరో 48 గంటల్లో ఆమెకు ఉరిశిక్షను అమలు చేయనున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఆమె ఉరిశిక్షను ఆపేందుకు ఎలాంటి మార్గాలు లేవని సుప్రీంకోర్టుకు తెలిపింది. భారత్-యెమెన్‌ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేనందున ఉరిశిక్షను ఆపేందుకు ప్రభుత్వానికి ఎలాంటి అనుకూల మార్గాలు లేవని భారత అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
మరో 48 గంటల్లో ఉరిశిక్ష భారత ప్రభుత్వం. భారత అత్యున్నత న్యాయస్థానం. ఒక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఇన్ని వ్యవస్థలు ఒకరికి క్షమాభిక్ష పెట్టించలేకపోవడం ఎంటి అనుకుంటున్నారా..? హత్య కేసులో యెమెన్‌లో ఉరిశిక్ష విధించబడ్డ కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షి తప్పించుకుంటుందా.. లేక యెమెన్ ప్రభుత్వ శిక్షకు బలవుతుందా మరి కొద్ది గంటల్లో తేలనుంది. ప్రియా కేసులో విదేశీ నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వం జోక్యం చేసుకునే సామర్థ్యం పరిమితమని, ప్రియా కేసు సంక్లిష్టమైన సమస్యగా ఉందని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఆమె ఉరిశిక్షను అడ్డుకునే మార్గాలు చాలా తక్కువగా ఉన్నాయని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. యెమెన్‌లో ఏమి జరుగుతుందో మనం తెలుసుకోవడానికి మార్గం లేదనీ.. ఉదయం కూడా యెమెన్ ప్రభుత్వంతొ చర్చలు జరిపినట్లు సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. ఈ చర్చల్లో నిమిషా ప్రియను విడుదల చేసేందుకు యెమెన్ ప్రభుత్వం అంగీకరించలేదని స్పష్టం చేసింది.
ప్రియాను కాపాడటానికి మిగిలి ఉన్న అవకాశం బ్లడ్ మనీ సెటిల్‌మెంట్ ద్వారానే జరుగుతుందని.. కానీ దానికి కూడా అక్కడి బాధిత కుటుంబం అంగీకరించడం లేదని ప్రియా తరపు న్యాయవాది సుభాష్ చంద్రాంకోర్టుకు తెలిపారు. నిమిషా ప్రియను కాపాడేందుకు యెమెన్ షరియా చట్టం ప్రకారం బాధితురాలి కుటుంబానికి నిమీషా కుటుంబం 8.6 కోట్లు (1 మిలియన్ డాలర్లు)బ్లడ్ మనీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అక్కడివారి కుటుంబం దానికి ఒప్పుకోవట్లేదన్న విషయాన్ని కోర్టుకు తెలిపారు. దీనిపై జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ యెమెన్‌లో ప్రియా ప్రాణాలు కోల్పోతే అది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రియా న్యాయవాది , అటర్ని జనరల్ వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణ జూలై 18కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ప్రియా కేసు పురోగతి గురించి జులై 18న తమకు తెలియజేయాలని కేంద్రం, ప్రియ తరపు న్యాయవాదికి సుప్రీంకోర్టు సూచించింది.
ప్రధాని మోదీకి కేరళ సీఎం లేఖ
మరోవైపు యెమెన్‌లో జైలులో ఉన్న నిమిషా ప్రియను విడుదల చేయడానికి అత్యవసరంగా జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరారు కేరళ సీఎం. మార్చి 24, 2025న కేంద్ర విదేశాంగ మంత్రికి గతంలో రాసిన లేఖను జత చేస్తూ ప్రధానికి లేఖ రాశారు. నిమిషా ప్రియ ప్రాణాలను కాపాడటానికి సంబంధిత అధికారులకు ఆదేశాలివాలని ప్రధానిని పినరయి విజయన్ కోరారు.నిమిషా ప్రియా టోమీ థామస్ ఉరిశిక్షను జూలై 16, 2025న నిర్ణయించినట్లు మీడియా ద్వారా తెలిసిందనీ ఇది సానుభూతికి అర్హమైన కేసుగా పేర్కొన్నారు..నిమిషా ప్రియను నిర్దోషిగా విడుదల చేసి సురక్షితంగా తిరిగి రావడానికి కృషి చేస్తున్న వారందరికీ కేరళ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు పినరయి విజయన్..
ఎవరీ నిమిషా ప్రియ .ఎందుకు ఉరిశిక్ష ..ఆమె చేసిన తప్పేంటి ?
కేరళ పాలక్కాడ్ జిల్లాకు చెందిన 38 ఏళ్ల నర్సు నిమిషా ప్రియ 2011లో పని కోసం కుటుంబంతో సహా యెమెన్‌కు వెళ్ళింది. 2014లో యెమెన్‌లో పౌర అశాంతి కారణంగా నిమిషా ప్రియ భర్త , కుమార్తెను తీసుకొని భారతదేశానికి తిరిగి వచ్చారు. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి నిమిష యెమెన్‌లోనే ఉండిపోయింది. యెమెన్ చట్టం ప్రకారం విదేశీ వైద్య నిపుణులు అక్కడ క్లినిక్ తెరవాలనుకుంటే యెమెన్ జాతీయుడితో భాగస్వామ్యం కుదుర్చుకోవాలి. దీంతో అక్కడ తలాల్ అబ్దో మహదీతో వ్యాపారం ప్రారంభించింది నిమిషా ప్రియ
కానీ అతను ఆమెను వివాహం చేసుకున్నానని తప్పుడు పత్రాలను చూపించి, ప్రియా పాస్‌పోర్ట్‌ను అతనిదగ్గరే పెట్టుకుని ఆమెను సంవత్సరాల తరబడి శారీరకంగా వేధించాడని, ఆర్థిక దోపిడీకి, పదే పదే బెదిరింపులకు గురిచేశాడని నిమిషా ప్రియ వెల్లడించింది. 2017లో తన పాస్‌పోర్ట్‌ను లాక్కొని యెమెన్‌ను విడిచి వెళ్లాలనే లక్ష్యంతో మహదిని మత్తు మందు ద్వారా ప్రియ ప్రయత్నించింది. కానీ ఆ మత్తు మోతాదు ప్రాణాంతకంగా మారడంతో తలాల్ అబ్దో మహదీ మృతి చెందాడు. ఆ తర్వాత తలాల్ అబ్దో మహదీ శరీరాన్ని ముక్కలు చేసి పారవేసిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2020లో ప్రియకు మరణశిక్ష విధించారు. ప్రియా మరణ శిక్షను 2023లో హౌతీల సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ సమర్ధించింది. ప్రియా ఉన్న జైలు హౌతీ పరిపాలన నియంత్రణలో ఉండటం వల్ల భారతదేశానికి అధికారిక దౌత్య సంబంధాలు లేనందున ప్రస్తుతం మారిన ప్రియా ఉరిశిక్ష నిలిపివేత కష్టతరంగా మారింది. ప్రస్తుతం యెమెన్ రాజధాని సనాలోని జైలులో నిమిషా ప్రియా ఉంది.