ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్, భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల కలుసుకున్నారు. కేవలం ఏడు సెకన్లలో గుండె జబ్బులను గుర్తించగల కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్ ‘సిర్కాడియావి’ని సిద్ధార్థ్ అభివృద్ధి చేశాడు.
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన సిద్ధార్థ్ కుటుంబం అమెరికాలో స్థిరపడింది. 14 ఏళ్ల సిద్ధార్థ్ ఒరాకిల్, ARM లచేత గుర్తింపు పొందిన AI నిపుణుడిగా పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హృదయ సంబంధ వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో విప్లవాత్మకంగా మార్చడానికి ఒక యాప్‌ను సిద్ధార్థ్ రూపొందించాడు. ఈ యాప్, స్మార్ట్‌ఫోన్ ఆధారిత గుండె ధ్వని రికార్డింగ్‌లను ఉపయోగిస్తుంది. 96 శాతానికి పైగా ఖచ్చితత్వ రేటును సాధించింది. దీనిని ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌లో 15,000 మందికి పైగా రోగులు, భారతదేశంలో 700 మంది రోగులపై పరీక్షించారు. వీరిలో గుంటూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లోని రోగులను సైతం పరీక్షించారు. సిద్ధార్థ్ స్వయంగా స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి ఆసుపత్రిలోని రోగులపై పరీక్షలు నిర్వహించారు.
సిద్ధార్థ్ సాధించిన పురోగతి గురించి తెలుసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆయనను సచివాలయానికి ఆహ్వానించి, ఆయన సాధించిన విజయాన్ని స్వయంగా అభినందించారు. దాదాపు అరగంట పాటు జరిగిన ఈ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధార్థ్ ప్రొఫైల్‌ను సమీక్షించి, కృత్రిమ మేధస్సు, ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో ఆయన తన పనిని కొనసాగించాలని ప్రోత్సహించారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి గణనీయమైన కృషి చేస్తున్న ప్రపంచ తెలుగు ప్రతిభ కోసం తన దార్శనికతను ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి సిద్ధార్థ్‌కు పూర్తి మద్దతు ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా సిద్ధార్థ్ కు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో యువ ఆవిష్కర్తతో పాటు అతని తండ్రి మహేష్, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా ఉన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో సిద్ధార్థ్ చేసిన పని పట్ల తన ప్రశంసలను పంచుకున్నారు. “ఈ 14 ఏళ్ల బాలుడు గుండె సంబంధిత సమస్యలను గుర్తించడం సులభతరం చేశాడు! డల్లాస్‌కు చెందిన యువ AI ఔత్సాహికుడు, ఒరాకిల్, ARM రెండింటి నుండి సర్టిఫికేషన్‌లను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన AI-సర్టిఫైడ్ ప్రొఫెషనల్ సిద్ధార్థ్ నంద్యాలను కలవడం చాలా ఆనందంగా ఉంది. సిద్ధార్థ్ యాప్, సర్కాడియన్ AI, గుండె సంబంధిత సమస్యలను క్షణాల్లో గుర్తించగల వైద్యపరమైన పురోగతి.” అని చంద్రబాబు పేర్కొన్నారు.
“మానవజాతి ప్రయోజనం కోసం సాంకేతికతను ఉపయోగించడంలో సిద్ధార్థ్ అసాధారణ ప్రతిభ, అంకితభావం చాలా ఆకట్టుకుంది. ఇంత చిన్న వయస్సులో, అతను మనందరికీ ఒక ప్రేరణ. ఆరోగ్య సంరక్షణ సాంకేతికత పట్ల అతని మక్కువను కొనసాగించమని హృదయపూర్వకంగా ప్రోత్సహిస్తున్నాను. అతని అన్ని ప్రయత్నాలలో పూర్తి మద్దతుకు హామీ ఇస్తున్నాను.” అంటూ సీఎం చంద్రబాబు రాసుకొచ్చారు.