Indian Railways: ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థలో భారత రైల్వే ఒకటి. ప్రపంచంలో ఇది నాలుగో స్థానంలో ఉండగా, భారత్‌లో మొదటి స్థానంలో ఉంది. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను కల్పిస్తోంది..
దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అమెరికా, చైనా, రష్యా తర్వాత స్థానంలో మన భారత రైల్వే ఉంది. సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లు, 22 వేలకు పైగా రైళ్లు, 7,308 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. మన ఇండియన్ రైల్వేకు టికెట్ల అమ్మకంతో పాటు సరుకు రవాణా ద్వారా భారీగా ఆదాయం లభిస్తుంది. అందేకాదు, రైల్వే స్టేషన్ల ద్వారా కూడా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. అయితే, దేశంలోని ఏ రైల్వే స్టేషన్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం వస్తుందో మీకు తెలుసా?
ఎక్కువగా ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్: దేశంలో అత్యధిక ఆదాయం వచ్చే రైల్వే స్టేషన్లలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ మొదటి స్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంసవత్సరంలో ఈ రైల్వే స్టేషన్ అత్యధికంగా ఆదాయం రాబడుతోంది. ఈ స్టేషన్ ద్వారా రూ. 3,337 కోట్లు. భారత రైల్వే విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ఆదాయంలోనే కాదు, అధిక రద్దీ ఉన్న స్టేషన్లలోనూ అగ్రస్థానంలో ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి నుంచి 39,362,272 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించినట్లు నివేదికలు చెబుతున్నాయి.
రెండో స్థానంలో హౌరా స్టేషన్: ఇక రెండో స్థానంలో హౌరా రైల్వే స్టేషన్ ఉంది. బెంగాల్ లోని ఈ స్టేషన్ 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 1,692 కోట్లు ఆదాయం వచ్చింది. అంతేకాదు, అత్యధిక రద్దీ ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది ఈ స్టేషన్. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏకంగా 61,329,319 మంది ప్రయాణికులు ప్రయాణించారు.
మూడో స్థానంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్: ఇక మూడో స్థానంలో చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఏడాదిలో రూ.1,299 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే ఈ స్టేషన్ నుంచి 30,599,837 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు.
నాలుగో స్థానంలో సికింద్రాబాద్: ఇక తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాలుగో స్థానం దక్కించుకుంది. 2023-24లో ఈ రైల్వే స్టేషన్ ద్వారా రైల్వేకు రూ. 1,276 ఆదాయం వచ్చింది. అలాగే ఈ స్టేషన్ నుంచి 27,776,937 మంది రాకపోకలు సాగించారు.
ఐదో స్థానంలో నిజాముద్దీన్ రైల్వే స్టేషన్: ఇక ఐదో స్థానంలో ఢిల్లీలోని హర్జత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ స్టేషన్ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1227 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక్కడి నుంచి14,537,687 మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.