విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మరో కీలక మలుపు తిరిగింది. చివరి రోజు నాటకీయ పరిణామాలు జరిగాయి.. గడువులోగా మొత్తం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మూడు సెట్లు దాఖలు చేశారు. చివరి రోజు మూడో సెట్ వేస్తూ బి-ఫారం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. చివరి రోజు ఎస్.కోట మండలం బొడ్డవరకు చెందిన ఇందుకూరి సుబ్బలక్ష్మి (రెండు సెట్లు).. అలాగే అదే మండలం వసికి చెందిన కారుకొండ వెంకటరావు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేసన్లు దాఖలు చేశారు. ఇవాళ నామినేషన్లు పరిశీలించి.. బుధవారం వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు.. ఈ నెల 28న ఎన్నిక జరుగుతుంది. అదే కనుక జరిగితే విజయం ఎవరిది అనే చర్చ జరుగుతోంది.
టీడీపీకి షాకిస్తూ ఇందుకూరి సుబ్బలక్ష్మి నామినేషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ఇప్పటి వరకు చంద్రబాబు నేతలతో చర్చించలేదు.. అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే సుబ్బలక్ష్మి పార్టీ నిర్ణయాన్ని పక్కన పెట్టి నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. న్యాయ పోరాటం కోసమే తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని సుబ్బలక్ష్మి అంటున్నారు. తన నామినేషన్‌కు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ఓటర్లు రాజకీయాలకు అతీతంగా తనను గెలిపిస్తారని నమ్మకంగా ఉన్నానని..ఉప ఎన్నికకు దారితీసిన పరిణామాలు తెలుసుకున్న టీడీపీ నాయకత్వం నుంచి తనకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కాలేదన్నారు. అందుకే నామినేషన్ వేశానని.. ఈ ఎన్నికల్లో విజయం న్యాయం వైపే ఉంటుంది అన్నారు. హైకోర్టును ఆశ్రయించిన తన భర్త రఘురాజు తొలి విజయం సాధించారని.. కచ్చితంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నానన్నారు. ఎంపీటీసీ సభ్యుల మనోభావాలు తనకు తెలుసని.. గత ప్రభుత్వంలో వారంతా ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు.
ఇందుకూరి సుబ్బలక్ష్మి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు వరకు వైఎస్సార్‌సీపీలో ఉన్నారు. ఆమె ఎస్.కోట మండల ఎంపీటీసీ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె ఎన్నికల ముందు తన అనుచరులతో కలిసి తెలుగు దేశం పార్టీలో చేరారు. ఈమె ఎమ్మెల్సీ రఘురాజు (విజయనగరం స్థానిక సంస్థలు) భార్య. ఈయన వైఎస్సార్‌సీపీలో ఉండగా.. సార్వత్రిక ఎన్నికల్లో తన మాట కాదని టీడీపీ మద్దతు ఇచ్చారని రఘురాజు చెప్పారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం సుబ్బలక్ష్మిని రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా నియమించారు. సుబ్బలక్ష్మి టీడీపీలో చేరిన తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజుపై వేటు పడింది. ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నామినేషన్లు ముగిసినంత వరకు ఈ తీర్పు కాపీ అందలేదు.