రాఖీ పండగ చరిత్ర చెప్పిన సుధామూర్తి.. నెటిజన్ల ట్రోల్స్‌

Sudha Murty: ఎప్పుడూ మీడియాలో, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ రకరకాల అనుభవాలను, విషయాలను పంచుకునే సుధామూర్తిపై ప్రస్తుతం నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఆమె.. తాజాగా రక్షా బంధన్ గురించి ఒక వీడియో విడుదల చేయడం పెను దుమారానికి కారణం అయింది. ఆమె పోస్ట్ చేసిన వీడియోపై నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రాఖీ పండగ మొఘలుల కాలం నుంచి ప్రారంభం అయిందని సుధామూర్తి పేర్కొనడం నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. అప్పుడు చితోడ్‌గఢ్ రాణి కర్ణావతి.. మొఘల్ చక్రవర్తి హుమాయున్‌ను సాయం అడిగారని.. అప్పటి నుంచే ఈ పండగ మొదలైందంటూ ఆ వీడియోలో సుధామూర్తి చెప్పారు. అయితే మహాభారత కాలం నుంచే ఉన్న ఈ రాఖీ పండగ గురించి సుధామూర్తికి తెలియదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

ఆ వీడియోలో రాఖీ పండగ గురించి వివరించిన సుధామూర్తి.. 16వ శతాబ్దంలో చితోడ్‌గఢ్‌ రాణి కర్ణావతి తాను ప్రమాదంలో ఉన్నప్పుడు.. మొఘల్‌ చక్రవర్తి హుమాయున్‌ సహాయం కోరినట్లు చెప్పారు. అప్పటి నుంచే ఈ రాఖీ సంప్రదాయం ప్రారంభమైందని సుధామూర్తి పేర్కొన్నారు. సోదరుడి చేతికి రాఖీ కట్టే ఈ పండగ తనకు చాలా ముఖ్యమైన పండగల్లో ఒకటి అని.. ప్రతీ ఒక్కరి జీవితాల్లో తోబుట్టువుల పాత్ర చాలా కీలకమని తెలిపారు. అంతేకాకుండా సోదరి కష్టంలో ఉన్నప్పుడు ఆమెకు సోదరుడు అండగా ఉంటాడనే భరోసాతో కట్టే దారమే రాఖీ అని.. అయితే అది 16వ శతాబ్దంలో ప్రారంభమైందని పేర్కొన్నారు. కర్ణావతి రాణి సామ్రాజ్యం చాలా చిన్నదని.. ఒక రోజు ఆమె రాజ్యంపై దండయాత్ర జరగడంతో ఆమె ప్రమాదంలో పడి ఏం చేయాలో తెలియని స్థితిలో ఒక చిన్న దారాన్ని మొఘల్‌ చక్రవర్తి హుమాయున్‌కు పంపించి.. తాను ప్రమాదంలో ఉన్నానని ఓ చెల్లిగా భావించి రక్షించాలని రాణి కర్ణావతి కోరిందని సుధామూర్తి చెప్పారు.

అయితే ఆ దారం హుమాయున్‌కు అందిన తర్వాత అతనికి అర్థం కాలేదని.. స్థానికులను అడిగిన హుమాయున్ అది సోదరుడి సాయం కోరుతూ సోదరి నుంచి వచ్చే పిలుపు అని వారు చెప్పారు. దీంతో వెంటనే కర్ణావతికి సాయం చేసేందుకు హుమాయున్‌ ఆమె సామ్రాజ్యానికి బయల్దేరినట్లు సుధామూర్తి చెప్పారు. అయితే గుర్రంపై వెళ్లడంతో.. అప్పటికే చాలా ఆలస్యమై.. కర్ణావతి ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. అప్పటి నుంచి రాఖీ సంప్రదాయం మాత్రం కొనసాగుతూ వస్తోందని.. ఈ రాఖీ పండగ రోజు మహిళలు ఎంతదూరంలో ఉన్నా సరే వారి సోదరుల వద్దకు వెళ్లి రాఖీ కడుతున్నారని సుధామూర్తి వీడియోలో వెల్లడించారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. సుధామూర్తి చెప్పిన కథ అతా కల్పితమని.. ఆమెకు చరిత్ర గురించి ఏమీ తెలియదు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. రాఖీ పండగ పురాణాల కాలం నుంచే ఉందని.. మహాభారతంలో కృష్ణుడి మణికట్టుకు గాయమై రక్తం కారుతుంటే అది చూసిన ద్రౌపది తన చీర కొంగును చింపేసి కట్టిందని.. అప్పుడు ఆమెకు ఏ కష్టం వచ్చినా తాను రక్షగా ఉంటానని హామీ ఇచ్చాడని చెబుతారు. కౌరవసభలో దుశ్శాసనుడు ద్రౌపదీ వస్త్రాపహరణం చేయగా శ్రీకృష్ణుడు ఆమెను రక్షిస్తాడని పురాణాల్లో ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. శ్రీమహావిష్ణువు వామన అవతారంలో మహాబలి చక్రవర్తి నివాసంలో ఉండగా వైకుంఠం నుంచి వచ్చిన శ్రీలక్ష్మి బలికి రాఖీ కడుతుందని.. దానికి ఎంతో సంతోషం వ్యక్తం చేసిన మహాబలి.. ఏ వరం కావాలో కోరుకోమనని అనగా.. శ్రీమన్నారాయణుడిని పంపించమని కోరుతుందని.. ఆ తర్వాత ఆదిశేషుడు వైకుంఠం చేరుతాడని పేర్కొంటున్నారు. పురాణాల గురించి తెలుసుకోండి అంటూ కొందరు నెటిజన్లు సుధామూర్తిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.

About amaravatinews

Check Also

ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!

ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిజ్‌లు నిత్యావసర వస్తువులుగా తయారయ్యాయి. వాటిని కరెక్ట్‌గా వాడకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్య …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *