కాకినాడ లో మూడు మరణాలు కేసులో పోలీసులు విచారణ ప్రారంభించారు.. పక్కా ప్లాన్ ప్రకారం చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలను చంపి , తాను ఆత్మహత్య చేసుకున్నాడు.. దానికి కావలసిన తాళ్లు ముందుగానే రెడీగానే ఉంచుకున్నాడు చివరిగా భార్యకి మిస్ యు అని మెసేజ్ చేశాడు.
కాకినాడలో హోలీ పండుగ రోజు విషాదం జరిగింది. ఓఎన్జిసి ఉద్యోగి చంద్ర కిరణ్ ఇద్దరు పిల్లలు జోషిల్,నిఖిల్‌లను కసాయిగా మారి కడతేర్చాడు. ఆ తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సొంత కొడుకులను ఒక ప్రొఫెషనల్ కిల్లర్‌లాగా హతమార్చాడు. హోలీ పండుగ సెలబ్రేషన్స్‌కి కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. మధ్యలో పిల్లలను తీసుకుని భార్యకు చెప్పి వెళ్ళాడు. స్కూల్ యూనిఫారం కొలతలు ఇవ్వాలని టైలర్ దగ్గరికి వెళ్లి వస్తానని అన్నాడు. పిల్లలు ఇద్దరినీ ఇంటికి తీసుకువెళ్లి కళ్లకు గంతలు కట్టి ఆడుకుందామని చెప్పాడు. ఆ తరువాత వాళ్ళ కాళ్లు చేతులు తాడుతో కట్టేసి రెండు బకెట్ల నీళ్లల్లో ఇద్దరినీ ముంచి ఊపిరాడకుండా చేశాడు. వాళ్లు చనిపోయారు అని నిర్ధారించుకున్న తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మెడకు తాడు బిగించి ఒక్కసారిగా మోకాళ్ళపై కూర్చోవడంతో నిమిషాలు వ్యవధిలో చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ముగ్గురు మృతదేహాలకు కాకినాడ జిజిహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయింది. అంత్యక్రియలు వాళ్ళ సొంత ఊరు తాడేపల్లిగూడెంలో నిర్వహించడానికి తీసుకుని వెళ్లారు. రెండు రోజుల్లో పోస్టుమార్టం రిపోర్టులు రానున్నాయి. అయితే ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం చంద్ర కిరణ్ ది ఆత్మహత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. మానసికంగా డిస్టర్బెన్స్‌లో ఉన్నా ఇలాంటి చర్యలు చేస్తారని అంటున్నారు. పోలీసులు చంద్రకిరణ్ ఇంట్లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఇల్లు కూడా చాలా లగ్జరీగా ఉంటుంది. ఎవరు బయట వాళ్ళు వచ్చే అవకాశం లేదు. చుట్టూ అందరూ హై ప్రొఫైల్ వ్యక్తులు ఉన్నారు. ఒకరికి ఒకరు సంబంధం ఉన్నట్లు కూడా అంతగా అనిపించదు.
ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు రాణించలేకపోతున్నారని వారి భవిష్యత్తుపై భయంతో ఈ దారుణం చేశానని సూసైడ్ నోట్‌లో రాశాడు. ఆ లెటర్‌లో భార్యపై చాలా ప్రేమ చూపించాడు. చివరిగా భార్య తనూజకు వాట్సాప్ మెసేజ్ చేశాడు. టైలర్‌తో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. పోలీసులు చంద్ర కిరణ్ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. ఇద్దరు పిల్లలను తీసుకుని చంద్ర కిరణ్ వచ్చినట్లు అందులో రికార్డు అయి ఉంది. అసలు పిల్లల భవిష్యత్తు అనుకోవడానికి వాళ్ళు చదివేది యూకేజీ మరొకరు ఫస్ట్ క్లాస్. ఇంత చిన్న వయసులో భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచిస్తాడు అనేది మిస్టరీగా మారింది. కుటుంబంలో.. కంపెనీలో.. ఏమైనా ఘర్షణలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మధ్యనే ఇద్దరు పిల్లలను స్కూల్ కూడా మార్చాడు చంద్ర కిరణ్. పిల్లలు అంటే ఎంతో ప్రేమ. వాళ్లే పంచప్రాణాలు. ఎందుకు ఈ విధంగా చేసుకున్నాడో అనేది అంతుపట్టని విషయంగా మారింది. గతంలో కూడా ఎటువంటి హెల్త్ ఇబ్బందులు కూడా లేవు. మంచి కుటుంబం, ఆస్తి బాగానే ఉంది. నెలకు లక్షన్నర శాలరీ, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. ఎందుకు ఈ విధంగా చేశాడు అనేది అర్థం కాని పరిస్థితి అయింది.