పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో లుకలుకలు.. కోర్టుకెక్కిన రచ్చ..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. క్రికెట్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ లీగ్‌లో పాల్గొనే ఫ్రాంఛైజీలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. వాటిని సొంతం చేసుకునేందుకు ఎంతో మంది దిగ్గజ వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటారు. ఇటీవల బ్రాండ్ వాల్యూ భారీగా పెరిగిన నేపథ్యంలో ఫ్రాంఛైజీల కోసం పోటీ పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి లీగ్‌లో భాగమైన పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీలో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఆ జట్టు యజమానుల మధ్య వాటాల విక్రయం విషయంలో వివాదం మొదలైనట్లు సమాచారం.

పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీలో నటి ప్రీతి జింటా, పారిశ్రామిక వేత్తలు మోహిత్ బర్మస్, నెస్ వాడియాలు ప్రధాన వాటాదారులుగా ఉన్నారు. ఇందులో అత్యధికంగా మోహిత్ బర్మస్ 48 శాతం వాటాను కలిగి ఉన్నారు. ప్రీతి జింటా 23 శాతం వాటాను కలిగి ఉన్నారు. మరో ఇద్దరితో కలిపి నెస్ వాడియా 23 శాతం వాటాకు యజమానిగా ఉన్నారు. అయితే ఫ్రాంఛైజీలో అత్యధిక వాటా కలిగిన మోహిత్ బర్మస్.. ఇతర వాటాదారులకు తెలియకుండా.. తన వాటాలో 11.5 శాతం కొత్త వ్యక్తికి విక్రయించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. ఇదే అసలు వివాదానికి కారణమైంది.

ఇది యజమానుల మధ్య అంతర్గత ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లే అని ప్రీతి జింటా బృందం ఆరోపిస్తోంది. ఫ్రాంఛైజీలోని వాటాదారుల్లో ఎవరైన తమ షేర్‌ను విక్రయించాలని భావిస్తే.. తొలుత ఇతర యజమానులకు సమాచారం ఇవ్వాలని పేర్కొంది. అపుడు వాటాదారులు కొనేందుకు ఆసక్తి చూపకపోతే.. వేరే వాళ్లకు విక్రయించుకునే అవకాశం ఉంటుందని.. ప్రీతి జింటా బృందం తెలిపింది. కానీ భాగస్వామ్యులకు తెలియకుండా మోహిత్ బర్మన్.. షేర్లను అమ్మేందుకు సిద్ధమయ్యాడని.. దీన్ని అడ్డుకోవాలని కోరుతూ.. ప్రీతి జింటా చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు వార్త కథనాలు వెల్లడించాయి. కాగా ఈ కేసుపై ఆగస్టు 20న విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక షేర్లను అమ్మేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై బర్మన్ స్పందించారు. తాను షేర్లను అమ్మడం లేదని.. అందుకు ప్రయత్నాలు కూడా చేయలేదని చెప్పుకొచ్చారు. దీంతో ఈ వివాదంపై సందిగ్ధత కొనసాగుతోంది. దీనిపై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం స్పందించలేదు.

ఇక ఐపీఎల్ ప్రారంభ సీజన్ నుంచి ఆడుతున్నప్పటికీ.. పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. అనిశ్చితికి మారుపేరుగా ఆ జట్టు ప్రదర్శన నిలుస్తోంది. కేవలం ఒక్కసారి మాత్రమే ఆ ఫ్రాంఛైజీ ఐపీఎల్ ఫైనల్ చేరింది. కానీ ఫైనల్‌లో ఓడి రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత గత పదేళ్లుగా మళ్లీ ఫైనల్ చేరలేదు.

About amaravatinews

Check Also

బోరున ఏడ్చిన భారత అభిమాని.. సారీ చెప్పిన సంజూ శాంసన్, వీడియో వైరల్

దక్షిణాఫ్రికాతో చివరి టీ20 మ్యాచ్‌లో 135 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *