ఐపీఎల్ వేలానికి ముహూర్తం ఫిక్స్..! ఫ్రాంఛైజీల రిటెన్షన్ డెడ్‌లైన్ అదే.. రూల్స్‌పై ఉత్కంఠ!

భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి కూడా క్రికెట్ అభిమానులకు.. ఐపీఎల్‌పై అత్యంత ఆసక్తి ఉంటుంది. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌.. ఇటు బీసీసీఐకి.. అటు ఆటగాళ్లపై కాసులు కురిపిస్తుందని చెప్పొచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్‌కు ఉంది. ఫ్రాంఛైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఇంకా ఉత్కంఠకరంగా సాగుతుంది. గత సీజన్‌కు ముందు నిర్వహించిన మినీ వేలంలోనే.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా రూ. 24.75 కోట్లు, రూ. 20.50 కోట్లు పలకడం గమనార్హం. ఇక ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్‌కు ముందు మెగా వేలమే నిర్వహించనున్నారంటే.. ఆసక్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్ ప్రపంచమంతా ఈ ఐపీఎల్ ఆక్షన్ కోసం ఎదురుచూస్తుంటుంది.

అయితే ఐపీఎల్- 18వ సీజన్ కోసం మెగా ఆక్షన్ నవంబర్‌లోనే జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మూడు లేదా నాలుగో వారాంతంలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలో లాగే ఈసారి కూడా వేలం పాటను విదేశాల్లోనే నిర్వహించనున్నట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్‌లో నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఐపీఎల్ సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

ఈసారి కూడా గల్ఫ్ దేశాల్లోనే ఐపీఎల్ వేలం నిర్వహించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో దుబాయ్‌లో ఐపీఎల్ వేలం నిర్వహించగా.. ఈసారి దోహా లేదా అబుదాబిలో నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో క్రికెట్ సహా ఇతర క్రీడలపై విపరీతమైన ఆసక్తి చూపుతూ.. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్లు పెడుతున్న సౌదీ అరేబియా కూడా ఐపీఎల్ ఆక్షన్ హోస్టింగ్ కోసం ఉత్సుకత చూపుతున్నట్లు తెలిసింది. వేదిక ఎక్కడ అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఐపీఎల్ వేలం తేదీ, సమయం సంగతి పక్కనబెడితే.. రిటెన్షన్ రూల్స్‌పై ఫ్రాంఛైజీల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఐపీఎల్ పది జట్ల ఫ్రాంఛైజీలతో.. పాలక మండలి సమావేశం చర్చలు అసంపూర్ణంగానే ముగిసినట్లు తెలిసింది. రిటెన్షన్ గురించి ఏకాభిప్రాయానికి రాలేదు. వేలానికి ముందు ఒక ఫ్రాంఛైజీ గరిష్టంగా ఎందరు ప్లేయర్లను అట్టిపెట్టుకోవచ్చు.. విదేశీ ప్లేయర్లు ఎంత మంది ఉండాలి.. ఇంపాక్ట్ రూల్.. ఇలా చాలా వాటిపైనే చర్చ జరగ్గా.. తలో అభిప్రాయం చెప్పడంతో ఒక కొలిక్కి రాలేదు.

మెగా వేలానికి ముందే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ రావాల్సి ఉంది. దీనికి మరికొంత సమయం పట్టొచ్చని.. ఈ నెలాఖరులోగా రిటెన్షన్ మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. దాదాపు 2 నెలల సమయం ఉండగా.. నవంబర్ 15 లోగా.. ఆయా టీమ్స్ తమ రిటెన్షన్స్ ప్రకటించేందుకు డెడ్‌లైన్ పెట్టాలని ఐపీఎల్ మండలి భావిస్తోంది. తర్వాత కొద్ది రోజుల్లోనే వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

About amaravatinews

Check Also

బుమ్రాను పొగుడుతూనే సిరాజ్ గాలి తీసిన ఆసీస్ స్పీడ్ స్టార్..

జస్ప్రీత్ బుమ్రా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో భారత విజయాలకు ప్రధాన స్తంభంగా నిలిచాడు. బ్రెట్ లీ అతని ప్రతిభను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *