మెయిల్‌కు రిప్లై ఇవ్వలేదన్న కారణంతో ఉద్యోగిని తొలగించిన సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ (ట్విట్టర్)కు భారీ షాక్ తగిలింది. సదరు ఉద్యోగికి పరిహారం చెల్లించాలని ఐర్లాండ్ వర్క్ ప్లేస్ కమిషన్ (డబ్ల్యూఆర్‌సీ) ఆదేశించింది. పరిహారంగా 5,50,000 బ్రిటన్ పౌండ్లు అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ.6 కోట్లు చెల్లించాలని ఈ మేరకు స్పష్టం చేసింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఇంత భారీ పరిహారాన్ని చెల్లించాలని ఐర్లాండ్ డబ్ల్యూఆర్సీ తీర్పు ఇవ్వడం ఇదే మొదటిసారి. ట్విట్టర్‌ను అక్టోబరు 2022లో సొంతం చేసుకున్న తర్వాత అదే ఏడాది నవంబరు 18న సంస్థలోని ఉద్యోగులందరికీ ఎలాన్ మస్క్ ఓ ఈ-మెయిల్‌ను పంపించారు.
ట్విటర్‌ని మెరుగుపరిచేందుకు అంకితభావం, సుదీర్ఘ పనిగంటలకు ఉద్యోగులు కట్టుబడి ఉండాలని అందులో మస్క్ సూచించారు. మెయిల్‌కి చివరిలో అవును, కాదు అనే ఆప్షన్లు ఇచ్చి అభిప్రాయాలు తెలపాలని పేర్కొన్నారు. ఎటువంటి సమాధానం ఇవ్వకపోతే స్వచ్ఛందంగా ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు పరిగణిస్తామని కండిషన్ పెట్టారు. ఇందుకు 24 గంటల సమయం ఇచ్చారు. లేకుండా మూడు నెలలు వేతనం ఇచ్చి ఇంటికి సాగనంపుతామని తెలిపారు. ఈ క్రమంలో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ ఆఫీసులోని సీనియర్ ఉద్యోగి గ్యారీ రూనీ.. ఎలాన్ మస్క్ ఈ-మెయిల్‌కు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.
దీంతో ఎటువంటి కారణాలు తెలపకుండా స్వచ్ఛందంగా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై గ్యారీ డబ్ల్యూఆర్‌సీని ఆశ్రయించారు. 2013 నుంచి ట్విట్టర్‌లో పనిచేస్తోన్న తనను ఎటువంటి కారణాలు లేకుండా తొలగించారని వాదించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కమిషన్.. తాజాగా తీర్పు వెలువరించింది. మెయిల్‌లో ‘అవును’ అనే ఆప్షన్ క్లిక్ చేయకపోవడాన్ని రాజీనామాగా పరిగణించలేమని న్యాయాధికారి మైఖేల్ మాక్‌నామీ స్పష్టం చేశారు.
అదేవిధంగా ఆకస్మికంగా ఉద్యోగం నుంచి ఆయనను తొలగించడం వల్ల ఆర్థికంగా, వృత్తిపరంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దీనికి పరిహారంగా అతడికి రూ.6 కోట్లు చెల్లించాలని ఆదేశించారు.
అర్ధాంతరంగా రూనీని ఉద్యోగం నుంచి తొలగించడంతో జనవరి 2023 నుంచి మే 2024 వరకు ఆయన 3,50,131 పౌండ్ల సంపాదన కోల్పోయారని, ఆ మొత్తంతో పాటు మానసికంగా క్షోభ, వృత్తిపరంగా సమస్యలకు మరో 2,00000 పౌండ్ల కలిసి మొత్తం 5.50 లక్షల పౌండ్లు పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ తీర్పుపై ట్విట్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది అన్యాయమని మండిపడింది. కాగా, మస్క్ ఈ-మెయిల్ పంపిన తర్వాత.. ఆ సంస్థలో 6 వేల మంది ఉద్యోగులను తొలగించడం గమనార్హం.