ఇజ్రాయేల్ అనుకున్నంత పనిచేసింది. ఈ నెల ప్రారంభంలో తమపై జరిగిన క్షిపణి దాడులకు ప్రతీకారం తప్పదని హెచ్చరించిన ఇజ్రాయేల్.. శనివారం ఉదయం ఇరాన్‌పై విరుచుకుపడింది. టెహ్రాన్ సహా నాలుగు నగరాల్లోని ఇరాన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది. ఆరు నెలల వ్యవధిలో ఇరాన్‌పై ఇజ్రాయేల్ దాడి చేయడం ఇది రెండోసారి. అక్టోబరు 1న ఇజ్రాయేల్‌పై 200కిపైగా బాలిస్టిక్ క్షిపణులతో ఇరాన్ దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని అమెరికాతో కలిసి ఇజ్రాయేల్ అడ్డుకుంది. దాడి నేపథ్యంలో ఇజ్రాయేల్ అంతటా సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ఇజ్రాయెల్‌కు చెందిన మూడు సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి.
తాజాగా, ఇరాన్‌పై ఇజ్రాయేల్ జరిపిన దాడి కూడా సైనిక స్థావరాలే లక్ష్యంగా జరిగింది. దాడిపై ఓ ప్రకటన విడుదల చేసిన ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) *ఇజ్రాయేల్‌కు వ్యతిరేకంగా ఇరాన్ పాలకుల నిరంతర దాడులకు ప్రతిస్పందనగా – ప్రస్తుతం ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు నిర్వహిస్తోంది’ అని పేర్కొంది. ఇరాన్, దాని మద్దతుదారుల దాడులకు ప్రతిస్పందించే బాధ్యత, హక్కు తమకుందని తెలిపింది. తమ రక్షణ, ప్రమాదకర సామర్థ్యాలు పూర్తిగా సమీకరించామని వివరించింది.