భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భూ పరిశీలన ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్-8 (EOS-08)ను చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక ఎఎస్ఎస్ఎల్వీ-డీ3 శుక్రవారం ఉదయం ప్రయోగించారు. ఆరున్నర గంటల కౌంట్ డౌన్ అనంతరం ఉదయం 9.17 గంటలకు బయలుదేరిన రాకెట్.. 17 నిమిషాల్లో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టింది. 175 కిలోల ఈవోఎస్-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశపెటినట్టు ఇస్రో ప్రకటించింది.
ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసిన ఈ ఉపగ్రహంలోని ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్‌ఫ్రారెడ్ (ఈవోఐఆర్), పేలోడ్ మిడ్-వేవ్, లాంగ్ వేవ్ ఇన్‌ఫ్రా-రెడ్‌లు భూమికి సంబంధించిన సమాచారాన్ని సేకరించనున్నాయి. ఇవి తీసిని ఫోటోలను విశ్లేషించి, వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలను అందజేయనుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో తెలిపింది. అంతేకాదు, ఇది SSLV ప్రాజెక్ట్‌కు అవకాశాలను తీసుకొస్తుందని, సరికొత్త మిషన్లకు శ్రీకారం చుడుతుందని పేర్కొంది.
పీఎస్ఎల్వీ ప్రయోగాలకు ఎక్కు సమయం, ఖర్చు కూడా అధికమే. కానీ, ఎస్ఎస్ఎల్వీ చాలా ప్రత్యేకమైనది. తక్కువ ఖర్చు, సమయం, పరిమిత మానవవనరుల సాయంతో కేవలం 72 గంటల వ్యవధిలో ప్రయోగానికి సిద్ధం చేయవచ్చు. ఇది ఇస్రో వాణిజ్య ప్రయోగాలను మరింత రెట్టింపు చేయగలదని భావిస్తున్నారు. తద్వారా ప్రపంచ అంతరిక్ష వాణిజ్యంలో భారత్ వాటా పెరుగుదలకు దోహదం చేస్తోంది. కాగా, 2022లో తొలిసారిగా నిర్వహించిన ఎస్ఎస్ఎల్వీ ప్రయోగం విఫలమైంది. దీంతో సమస్యను గురించి సరిచేసిన ఇస్రో.. గతేడాది మరో ప్రయోగం నిర్వహించి విజయవంతమైంది.