వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు గురయ్యాడని చెప్పారు. రషీద్ హత్యను జనసేన తరుఫున తాము ఖండిస్తున్నట్లు చెప్పారు.
అయితే రషీద్ హత్యకు వైఎస్ జగన్, వైసీపీ రాజకీయ రంగు పులుముతోందని నాగబాబు విమర్శించారు. వైసీపీ నేతలు ఇంతకాలం శవరాజకీయాలు చేశారన్న నాగబాబు.. వైఎస్ జగన్ చెప్పే మాటలను జనం నమ్మడం మానేశారని చెప్పారు. వైసీపీ పార్టీ నాయకుడిగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం తప్పుకాదన్న నాగబాబు.. అక్కడకు వెళ్లి ఇలా విమర్శలు చేయడం, జగనన్న పథకాలు, జగన్ మామ అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం నటిస్తారని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.
2019లో ప్రజలు మీకు అద్భుతమైన రీతిలో అధికారం ఇచ్చారన్న నాగబాబు.. అయితే వైసీపీ పాలనలో సామాన్యుడు సైతం భయపడిపోయేలా పాలన సాగిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర రోజులు కూడా పూర్తి కాకముందే ఇలాంటి విమర్శలు చేయడం ఏమిటని వైసీపీని, వైఎస్ జగన్‌ను నాగబాబు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనల సమయంలో వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.