జనసేన పార్టీ సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఈ నెల 18న సభ్యత్వ నమోదు ప్రారంభంకాగా.. ఇప్పటి వరకు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని నేతలు తెలిపారు. దీంతో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. మరో వారం పాటూ సభ్యత్వ నమోదుకు గడువును పెంచామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించి.. ప్రతి నియోజకవర్గంలోనూ 5 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా కృషి చేద్దామన్నారు.
గత ఏడాది కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయి అన్నారు. ఏపీలో 175 నియోజకవర్గాలతోపాటు తెలంగాణలో ఎంతో ఉత్సాహంగా సభ్యత్వాలు జరుగుతున్నాయి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు. సభ్యత్వ నమోదు సమయంలో కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదుకు జనసైనికులు ముందుకు వస్తున్నారని.. తీవ్రంగా వర్షాలు పడి ఇబ్బంది పెట్టినందువల్ల సభ్యత్వ నమోదు గడువును పెంచాలని పార్టీ నేతలు కోరారన్నారు. జనసేన పార్టీ నేతలు, కేడర్ వినతి మేరకు మరో వారం గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని..గత ఏడాది కంటే ఎక్కువగా, రికార్డు స్థాయిలో సభ్యత్వాలు నమోదయ్యాయని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
‘1 మిలియన్ మార్క్ దాటిన జనసైన్యం గత పది రోజులుగా జరుగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా సభ్యత్వం తీసుకున్న పది లక్షలకు పైగా జనసైనికులు, వీర మహిళలు. సమాజంలో మార్పు కోసం, సరికొత్త రాజకీయ వ్యవస్థ కోసం జనసే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం ముందడుగు వేసిన మీ అందరికీ జనసేన పార్టీ తరపున అభినందనలు తెలియజేస్తున్నాము’ అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసి జనసైనికులకు శుభాకాంక్షలు తెలిపింది. మరో వారం గడువు ఉండటంతో ఇంకా సభ్యత్వాలు పెరుగుతాయంటున్నారు.