‘50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్’.. సీఎం సంచలన ఆరోపణలు

బీజేపీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వాన్ని (Karnataka) కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, కాంగ్రెస్‌కు చెందిన 50 మంది ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.50 కోట్లు ఇవ్వజూపిందని ఆయన ఆరోపించారు. అయితే, ఇందుకు ఏ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కూడా అంగీకరించకపోవడంతో తమపై తప్పుడు కేసులు పెట్టే పనిలో బీజేపీ ఉందని విమర్శించారు. తన సొంత మైసూరులో బుధవారం పర్యటించిన సీఎం సిద్ధరామయ్య.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటుచేసి సభలో పాల్గొని ప్రసగించారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష బీజేపీపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ పార్టీ నాయకులంతా కోట్లు పోగేసుకున్నారని, ఆ డబ్బును తమ ఎమ్మెల్యేకు ఎరగా వేశారని విమర్శించారు. అయినప్పటికీ మా ఎమ్మెల్యేలు ఎవరూ ప్రలోభానికి గురికాకపోవడంతో తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు సాగిస్తున్నారని మండిపడ్డారు.

‘‘సిద్ధరామయ్య సర్కారును ఎలాగైనా కూల్చివేయాలని కంకణం కట్టుకున్నారు…. 50 మంది ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున వారు (ఆఫర్‌) చేశారు. అంత సొమ్ము వారికి ఎక్కడ నుంచి వచ్చింది? నోట్లను ఏమైనా ముద్రిస్తున్నారా? మాజీ ముఖ్యమంత్రులు బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మై, విపక్ష నేత ఆర్‌ ఆశోకా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర ఆ డబ్బును చెల్లిస్తున్నారా?’ అని సీఎం ప్రశ్నించారు. మరోవైపు, బీజేపీ నేతలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని సిద్ధూ దుయ్యబట్టారు. బందీపుర అభయారణ్యం పరిధిలోని రహదారులపై రాత్రుళ్లు వాహన సంచారాన్ని నిలిపివేసే అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని సీఎం వెల్లడించారు. ఈ విషయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్న మాటలు తన దృష్టికి రాలేదని స్పష్టం చేశారు.

కాగా, చెన్నపట్న ఉప-ఎన్నికల ప్రచారం చివరి రోజున తన మనవడు, ఎన్డీఏ అభ్యర్ధి నిఖిల్ కుమారస్వామి తరఫున ప్రచారం నిర్వహించిన జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ.. సిద్ధరామయ్య ప్రభుత్వం జనవరి తర్వాత ఉండదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని కర్ణాటక సీఎం ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేవెగౌడ మాట్లాడుతూ.. ‘ఎన్డీఏ అభ్యర్ధి నిఖిల్ కుమారస్వామిని గెలిపించి.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అహంకారాన్ని అణచివేయాలి.. జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కేంద్ర మంత్రి సోమన్న అన్నారు.. ఇది జోస్యం కాదు.. జరగబోయేది ఇదే’ అంటూ దేవెగౌడ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

About amaravatinews

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *