Sabarimala: అయ్యప్ప స్వామి వార్షిక ఉత్సవాల్లో కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. శబరిమలలోని కందమల శిఖరంపై అయ్యప్ప మకరజ్యోతి దర్శనం ఇచ్చేందుకు సమయం ఆసన్నం అయింది. ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో కనిపించే ఈ మకరజ్యోతిని కళ్లారా చూసేందుకు వేలాది మంది అయ్యప్ప భక్తులు.. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి.. శబరి కొండకు చేరుకుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ శబరిమలలో కనిపించే మకరజ్యోతిని చూసేందుకు అక్కడ ఉన్నవారే కాకుండా యావత్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. టీవీలు, సోషల్ మీడియాల్లో ఈ మకరజ్యోతికి సంబంధించిన దృశ్యాలు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.
మకర సంక్రాంతి రోజున సాయంత్రం సమయంలో శబరిమల ఆలయానికి ఎదురుగా ఉండే కందమల శిఖరంపై మకరజ్యోతి కనిపిస్తుంది. ఈ అద్భుత మకరజ్యోతిని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. మకరజ్యోతిని దర్శించుకున్న తర్వాత అయ్యప్ప మాల వేసుకున్న స్వాములు.. దీక్షను విరమించనున్నారు. తన భక్తులను ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామే మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.