కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారా.? అయితే ఇది మీకోసమే..

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ప్రకటించినా, ఇప్పటివరకు పౌర సరఫరాల శాఖకు అధికారిక ఆదేశాలు అందలేదు. దీంతో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తుదారులు అయోమయానికి గురవుతున్నారు. గతంలో నిర్వహించిన కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం, గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల్లేని సుమారు 83,000 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో 70 శాతం కుటుంబాలు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. అయితే, పారదర్శకత కోసం వార్డు సభలలో లబ్ధిదారుల జాబితా ప్రకటించాలని నిర్ణయించినప్పటికీ, ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవడంతో ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

దరఖాస్తులపై స్పందన లేకపోవడంతో అనిశ్చితి

గతంలో 5.73 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ప్రభుత్వం గ్యారంటీ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చి, మిగతా దరఖాస్తులను పక్కన పెట్టింది. తాజా సర్వే ఆధారంగా అర్హత పొందిన కుటుంబాలపై విచారణ జరిపినా, ఇంకా నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల కోసం 1,31,484 కుటుంబాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాయి. అయితే, ఇప్పటివరకు క్షేత్రస్థాయి విచారణ ప్రారంభం కాలేదు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు లేకపోవడం, దరఖాస్తుల పరిశీలన విషయంలో మౌలిక చర్యలు లేకపోవడం వల్ల రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిలిచిపోయినట్లు కనిపిస్తోంది.

మార్చి 1న కొత్త రేషన్ కార్డుల జారీపై అనుమానాలు..

తాజాగా మార్చి 1వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని అధికారికంగా ప్రకటించినా, దీనిపై ఇంకా స్పష్టత లేదు. పౌర సరఫరాల శాఖ అధికారుల ప్రకారం, ఆన్‌లైన్ దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ అనంతరం మాత్రమే రేషన్ కార్డుల జారీ జరగనుంది. దీంతో కార్డుల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల కోసం వేలాది కుటుంబాలు వేచిచూస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను విడుదల చేసి, కార్డుల మంజూరుకు స్పష్టమైన ప్రణాళికను ప్రకటించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పౌర సరఫరాల శాఖ, జీహెచ్ఎంసీ మధ్య సమన్వయం మెరుగుపడితే మాత్రమే ఈ సమస్య పరిష్కారం కానుంది.

About Kadam

Check Also

ఐపీఎల్‌లో ఫిక్సింగ్ ఆరోపణలపై క్లారిటీ ఇచ్చిన రాచకొండ సీపీ.. ఏమన్నారంటే?

ఐపీఎల్ 2025లో ఉత్కంఠ మ్యాచ్‌లు సాగుతున్నాయి. ప్రస్తుతం లీగ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్స్ చేరే జట్లపైనా ఓ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *