Khushboo: మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఇటీవలె కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. ఈ క్రమంలోనే వయనాడ్ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే వయనాడ్‌లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా బరిలోకి దిగుతారని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి ప్రత్యర్థిగా బీజేపీ తరఫున సీనియర్ నాయకురాలు, నటి ఖుష్బూ సుందర్‌ను నిలబెట్టారని కమలం పార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉపఎన్నిక కావడం, పైగా కేరళలో మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో ఒకే ఒక సీటు దక్కించుకోవడం, ఆ రాష్ట్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలో ఉండటం, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ స్థానంలో నిలిపే అభ్యర్థి విషయంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రియాంక గాంధీకి సరైన అభ్యర్థిని బరిలోకి దించాలని కమలం పార్టీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖుష్బూ సుందర్ అయితే గట్టిపోటీ ఇవ్వవచ్చనే భావనలో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.