Junior Doctor: పశ్చిమ బెంగాల్‌లో మెడికల్ స్టూడెంట్‌పై హత్యాచారం జరగడం తీవ్ర దుమారం రేపుతోంది. రాజధాని కోల్‌కతాలో ఉన్న ఓ మెడికల్ కాలేజీలో అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించిన ఆ మహిళా ట్రైనీ డాక్టర్ విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లిందని.. ఉదయం చూసేసరికి శవంగా కనిపించినట్లు తోటి మెడికల్ స్టూడెంట్స్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలపగా.. ఆమె మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించగా.. కీలక విషయాలు బయటికి వచ్చాయి. బాధితురాలిపై దారుణంగా లైంగిక దాడి జరిగిందని.. ఆమె శరీరంపై, ప్రైవేటు భాగాలపై తీవ్రంగా గాయాలు అయినట్లు గుర్తించారు. అతి కిరాతకంగా ఆమెను హింసించి చంపినట్లు తేల్చారు. ఈ ఘటన బెంగాల్‌లో తీవ్ర దుమారం రేకెత్తడంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తామని.. అవసరం అయితే ఉరిశిక్ష కూడా పడేలా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు.
కోల్‌కతాలోని ఆర్ కర్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత అతి కిరాతకంగా ఆమెను హత్య చేసినట్లు 4 పేజీల పోస్ట్‌మార్టం నివేదికలో డాక్టర్లు వెల్లడించారు. అలాగే ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి తీవ్రంగా రక్త స్రావం అయిందని తెలిపారు. ఇంకా ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు అయినట్లు గుర్తించారు. ఈ ఘటనతో ఆ మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలించారు. వాటి ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఇప్పటికే ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెప్పారు. అయితే అతడికి.. మెడికల్ కాలేజీతో సంబంధం లేదని గుర్తించారు.