కుప్పంలో వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత.. చంద్రబాబు కండిషన్స్‌కు ఓకే చెప్పి, ఆ లేఖ పంపి మరీ!

చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్సార్‌సీపీకి ఎదురు దెబ్బ తగిలింది. కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌ డాక్టర్‌ సుధీర్ వైఎస్సార్‌సీపీకి, మున్సిపల్‌ ఛైర్మన్‌, కౌన్సిలర్‌ పదవులకు రాజీనామా చేశారు. తన ఛైర్మన్‌ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను మున్సిపల్ కమిషనర్‌కు పంపారు. అనంతరం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో డాక్టర్ సుధీర్‌ తెలుగు దేశం పార్టీలో చేరారు. ఆయనకు చంద్రబాబు పసుపు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. చంద్రబాబుతోనే కుప్పం సమగ్ర అభివృద్ధి సాధ్యమని తామంతా నమ్ముతున్నామని.. ఆయన వెంట కలిసి నడిచేందుకే అన్ని పదవులకు రాజీనామా చేశానని సుధీర్ తెలిపారు.

ఇతర పార్టీల నుంచి వచ్చేవారు తెలుగు దేశం పార్టీలో చేరాలంటే కచ్చితంగా వారు తమ పదవులకు రాజీనామా చేసి రావాలని చంద్రబాబు కండిషన్ పెట్టారు. ఈ క్రమంలోనే సుధీర్ వైఎస్సార్‌సీపీకి, మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిన తర్వాతే తెలుగు దేశం పార్టీలో చేరారు. రెండు, మూడు నెలల క్రితమే సుధీర్ టీడీపీలో చేరతారని ప్రచారం జరిగింది.. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. చివరికి సుధీర్ తన అనుచరులతో కలిసి వచ్చి అధికార పార్టీలో చేరారు. అయితే సుధీర్ తన పదవులకు రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. అక్కడ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందా అనే చర్చ జరుగుతోంది.

కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి.. 19 చోట్ల వైఎస్సార్‌సీపీ, ఆరుచోట్ల టీడీపీ కౌన్సిలర్లు గెలిచారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కుప్పంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. మున్సిపల్ ఛైర్మన్ డాక్టర్ సుధీర్ టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నించగా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఆయనతో పాటూ 11మంది కౌన్సిలర్లు తెలుగు దేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.. కానీ వైఎస్సార్‌సీపీ నుంచి చేరికలకు టీడీపీ అధిష్టానం నో చెప్పింది. ఆ తర్వాత రెండు నెలల క్రితం సుధీర్ చేరికలకు సిద్ధంకాగా చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇప్పుడు తాజాగా డాక్టర్ సుధీర్ వైఎస్సార్‌సీపీతో పాటూ తన మున్సిపనల్ ఛైర్మన్, కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసిన తర్వాత పసుపు కండువా కప్పుకున్నారు.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *