గుంటూరు జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం రపింది. పెదకాకాని సమీపంలో యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన మహేష్, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలజతో గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. మహేష్ డిప్లొమా వరకు చదివి.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో ఉద్యోగం చేశాడు. అక్కడే శైలజతో పరిచయం ఏర్పడగా.. తర్వాత ఇద్దరు ప్రేమించుకున్నారు.
ఇటీవల మహేష్, శైలజల ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. యువకుడి తల్లిదండ్రులు 10 రోజుల క్రితం పెళ్లికి అంగీకరించారు. కానీ శైలజ తల్లిదండ్రులు మాత్రం అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది. దసరా పండుగ సమయంలో శైలజ, మహేష్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. వీరిద్దరి కోసం యువతి కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ దొరకలేదు.
శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై చనిపోయి ఉన్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వీరిద్దరు రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. గతవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు.. ఐదారు రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నారన్నది క్లారిటీ లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Amaravati News Navyandhra First Digital News Portal