గుడివాడ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం రోజు గుడివాడ వెళ్లిన పేర్ని నానిని జనసేన నేతలు అడ్డుకున్న సంగతి తెలిసందే. గతంలో పేర్ని నాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. పోలీసులు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. అయితే తాజాగా పేర్ని నాని మచిలీపట్నం పోలీస్టేషన్‌లో తన డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించారు. పేర్ని నాని కారు అద్దాలు పగుల కొట్టారని ఫిర్యాదులో పేర్కొనడంతో.. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం రోజు గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలియడంతో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో ఆయనపై కొందరు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, యువకులు కోడిగుడ్లు విసిరారు.. నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.. అయితే ఎంతకీ పేర్ని నాని స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసైనికులు పేర్ని నానిపై ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు జనసైనికుల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు పగిలాయి.
వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు తోట శివాజీ ఇంటి దగ్గరకు తరలివచ్చి.. జనసైనికులను పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జనసైనికులకు, పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం, తోపులోట జరిగింది. పేర్ని నాని పవన్‌కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటినివ్వబోమని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడకు రావడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పేర్ని నాని రెండు చెప్పులతో పవన్‌ను అవమానించారని.. ఇప్పుడు చాలా చెప్పులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తానికి పోలీసులు జాగ్రత్తగా పేర్ని నానిని అక్కడి నుంచి పంపించారు. ఈ కేసు వ్యవహారంపై జనసైనికులు స్పందించాల్సి ఉంది. అలాగే మచిలీపట్నంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం లేకపోలేదు. మాజీ మంత్రి పేర్ని నాని కారును గుడివాడలో ధ్వంసం చేశారు.. ఫిర్యాదు మాత్రం మచిలీపట్నం ఇవ్వడంతోనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.
Amaravati News Navyandhra First Digital News Portal