Maintenance Schedule: మన దేశంలో డిజిటల్ పేమెంట్లు భారీగా జరుగుతున్నాయి. అందులో ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్ విరివిగా ఉపయోగిస్తున్నారు. గ్రామీణా ప్రాంతాల్లోనూ యూపీఐ పేమెంట్స్ భరీగా పెరిగాయని చెప్పవచ్చు. ఇతర దేశాలకు సైతం యూపీఐ సేవలు విస్తరించాయంటే ఎంత ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, బ్యాంక్ కస్టమర్లు తమ బ్యాంక్ ప్రకటనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. లేదంటే యూపీఐ సేవలు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు దేశంలోని ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) కీలక ప్రకటన చేసింది. బ్యాంక్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ప్రకటించింది. ఆగస్టు 4వ తేదీన పలు డిజిటల్ సేవలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది.
ఆగస్టు 4, 2024వ రోజున యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వివిధ రకాల సేవలు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. ‘ ఈ నెల 4వ తేదీన అనగా ఆదివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు షెడ్యూల్డ్ డౌన్‌టైమ్ ఉంటుంది. అలాగే రాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు మెయింటెనెన్స్ టైమ్ ఉంటుంది. ఆయా సమయాల్లో యూపీఐ సహా వివిధ రకాల ఆన్‌లైన్ చెల్లింపులు ఆగిపోతాయి.’ అని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకారం దాదాపు 5 గంటల వరకు యూపీఐ వంటి ఆన్‌లైన్ సేవలు ఆగిపోయే అవకాశం ఉంది. ఎవరైనా ఆయా సమయాల్లో డిజిటల్ చెల్లింపులు చేయాలనుకుంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వారంతా లిక్విడ్ క్యాష్ తీసుకెళ్లడం మంచిది. ఆ సమయంలో మనకేం అవసరం పడుతుందనే అలసత్వం వహించకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. బ్యాంక్ నోటిఫికేషన్ ప్రకారం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ , గూగుల్ పే, వాట్సాప్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి వాటి ద్వారా చెల్లింపులు చేయరాదు. అయితే, పీఓఎస్ సాయంతో చేసే ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ప్రభావం ఉండదని బ్యాంక్ తెలిపింది. అత్యవసర ట్రాన్సాక్షన్ల కోసం వాటిని ఉపయోగించుకోవచ్చని తెలిపింది.