ఏపీలోని ఈ ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే చాలు సంతాన భాగ్యం..!

అమ్మతనం కోసం ఎదురుచూసి, అలసిపోయిన మహిళలకు ఆ ఆలయం ఒక ఆపన్నహస్తంలా కనిపిస్తుంది. ఆలయంలో నిద్ర చేస్తే చాలు, దోషాలు తొలగి “అమ్మ” అనే కమ్మని పిలుపు సొంతమవుతుందనేది ఈ ఆలయానికి వచ్చే భక్తుల నమ్మకం. ఈ నమ్మకం ఊరు, వాడా, జిల్లా, రాష్ట్రం నలుమూల వ్యాపించడంతో ఈ పురాతన ఆలయానికి భక్తజనం పోటెత్తుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వంటి కొన్ని విశిష్ట రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి పిల్లల లేని దంపతులు ఆలయానికి భారీ సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి సంవత్సరం కాలంలో పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి.. స్వామివారికి మొక్కులు తీరుస్తూ ఆలయంలో ప్రత్యేకంగా ఉయ్యాల వేసి పూజలు చేస్తుంటారు.

ఇంతటి ప్రాచుర్యం పొందిన ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? కాకినాడ జిల్లా  పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో పాములు మల్లవరంగా పిలిచే ఏకే మల్లవరం గ్రామంలో ఉంది. సంతానం లేని దంపతులకు వరంలా కనిపిస్తున్నాడు మల్లవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్తులు సర్పదోష నివారణ పూజలను ఎక్కువగా నిర్వహిస్తారు. పిల్లలు లేని దంపతులు ఇక్కడ స్వామివారికి దోషనివారణ పూజలు చేస్తూ.. సంతానం ఆశిస్తున్నారు. అలవెళ్లి మల్లవరం అని పిలుచుకునే ఈ ఏకే మల్లవరం గ్రామంలోని దేవాలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితం చేశారు. ఈ ఆలయం సర్పదోష పూజకు ప్రసిద్ధి చెందింది.

ఈ ఆలయానికి విచ్చేసిన సంతానం లేని మహిళలు నాగులు చీర ధరించి, గర్భగుడి వెనకాల ఉన్న శయన మందిరంలో గంటసేపు నిద్రిస్తారు. అనంతరం దంపతులు కలసి ఆలయంలో జరిగే అభిషేకాల్లో పాల్గొని, దోష నివారణ పూజలు చేస్తుంటారు.

ఈ ప్రాంతాన్ని చోళులు పరిపాలించినట్లు స్థానికులు చెబుతుంటారు. దీనికి ఆధారంగా  ఒక రైతు పొలంలో రాగిరేకులతో కూడిన కొన్ని శాసనాలు, తాళపత్ర గ్రంథాలు దొరికాయని వారు చెబుతున్నారు. 1960వ సంవత్సరంలో తాళపత్రాలు దొరికిన అనంతరం, ఆ రైతు పొలంలో ఒక పెద్ద నాగుపాము నిత్యం కనిపించేదని చెబుతారు. ఆ పామును ఒక ప్రదేశంలో ఉంచి, 1962లో మల్లవరం గ్రామంలోని కొంతమంది పెద్దలు కలిసి ఆలయ శంకుస్థాపన చేశారని, ఆ శంకుస్థాపన అనంతరం ఆ పాము స్వామిగా అవతరించిందని ఆలయ అర్చకులు చెబుతున్నారు.

అలాగే మరికొంతకాలం గడిచిన తర్వాత మరో పెద్ద పాము ఈ ఆలయానికి నిత్యం వచ్చేది. అక్కడ ఉన్న కోనేరులో స్నానమాచరించి, ఆలయంలో భక్తులచే పూజలు అందుకుంటుందని అర్చకులు తెలియజేస్తున్నారు.

ఈ ఆలయాన్ని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించి, ఈ ఆలయ విశిష్టతను అనేక సందర్భాల్లో చాటి చెప్పారు. అప్పటినుంచి భక్తుల తాకిడి ఈ ఆలయానికి విపరీతంగా పెరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టికి, మాస శివరాత్రికి, షష్టి మంగళవారం కలసి వచ్చే రోజుల్లో ఈ ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో నిద్రించేందుకు మహిళలు టోకెన్లు తీసుకొని వేచి ఉంటారు.

About Kadam

Check Also

తల్లి మరణం.. మృతదేహం పక్కనే రోదిస్తూ కూతురు కూడా..! కన్నీళ్లు పెట్టిస్తున్న ఘటన

విజయనగరం జిల్లా భోగాపురంలో విషాద ఘటన. 74 ఏళ్ల వనజాక్షి అనారోగ్యంతో మరణించగా, ఆమె కుమార్తె విజయలక్ష్మి తీవ్ర దుఃఖంతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *