ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి.. బుధవారం నుంచి అమ్మకాలు మొదలుపెట్టారు. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్లుగా.. లాటరీలో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్నవారిని కొత్త సమస్య వెంటాడుతోంది. శుభమా అని కొత్త షాపు ఓపెన్ చేద్దామంటే అద్దెకు గదులు దొరకడం లేదు.. రాష్ట్రంలో చాలామందికి ఇదే సమస్య ఎదురవుతోంది. షాపుల దొరక్క ఇబ్బందులుపడుతున్నారు.. కొన్ని ప్రాంతాల్లో షాపులు దొరికినా అద్దెలు భారీగా ఉండటంతో భయపడుతున్నారు. ఒక్కరోజు మద్యం విక్రయాలు ఆగిపోయినా నష్టాలు తప్పవు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు తాత్కాలికంగా వసతి ఏర్పాటు చేసుకుని మద్యం విక్రయిస్తున్నారు.
విశాఖపట్నంలో ఓ వ్యక్తికి ఇలాంటి సమస్య వచ్చింది. అప్పుడు ఆయన కాస్త స్మార్ట్‌గా ఆలోచించారు. తనకు వచ్చిన షాపు సమస్యను చాలా ఈజీగా పరిష్కరించారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి మద్యం షాపు లాటరీలో దక్కింది.. ఆయనకు షాపు విషయంలో ఇబ్బంది ఎదురైంది. వెంటనే సరికొత్త ఆలోచన చేశారు.. వెంటనే అమలు చేశారు. అక్కయ్యపాలెం జగ్గారావు బ్రిడ్జి దగ్గర షాపు ఏర్పాటు చేయాలనుకున్న చోట భవనం ఇంకా నిర్మాణంలో ఉంది. దీంతో ఆలస్యం చేయకుండా ఇలా కంటైనర్‌లోనే దుకాణం ప్రారంభించేశారు. నిర్మాణంలో ఉన్న భవనం పూర్తికాగానే అందులోకి మార్చుతామని ఆయన చెబుతున్నారు. ఇలా వెరైటీగా కంటైనర్ ఆలోచనతో తన సమస్యను పరిష్కరించారు.