శ్రీకాకుళం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. అందరూ చూస్తుండగానే రైలు కిందకు దూకడానికి ప్రయత్నించగా తోటి ప్రయాణికులు కాపాడారు.. మళ్లీ రెండోసారి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఓ యువకుడు ఉదయం 7 గంటల సమయంలో.. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా రైలులో నుంచి పలాస రైల్వేస్టేషన్‌లో దిగాడు. అక్కడి నుంచి రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం నుంచి ట్రైన్ బోగీల మధ్యకు దూకడానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన తోటి ప్రయాణికులు అతడ్ని పక్కకు లాగేశారు.
ఆ ఘటనలో యువకుడి తలకు తీవ్ర గాయం కాగా.. వెంటనే జీఆర్పీ పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఇంతలో బెంగళూరు నుంచి అసోం వెళ్తున్న కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్‌ఫాంపైకి వస్తోంది.. ఆ యువకుడు జీఆర్పీ సిబ్బందిని తోసేసి రైలు ముందుకు దూకేశాడు. పాపం రైలు అతడి పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి వివరాలు తెలియాల్సి ఉండగా.. పోలీసులు మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మొదట గాయపడిన సమయంలో ఆ యువకుడు హిందీలో కేకలు వేసినట్లు స్టేషన్‌లో ఉన్నవాళ్లు చెబుతున్నారు. తనకు ఎవరూ లేరు.. ఎవరి కోసం బతకాలి.. తనకు ఎందుకు వైద్యం చేయడానికి తీసుకెళ్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారట. ఈ ప్రమాదం కారణంగా కామాఖ్య ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట పాటు పలాస రైల్వేస్టేషన్‌లో నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందిపడ్డారు. మొదటిసారి ప్రాణాలు తీసుకునేంద ప్రయత్నించగా.. ప్రయాణికులు కాపాడారు. కానీ రెండోసారి మాత్రం మరణాన్ని తప్పించుకోలేకపోయాడు.