Chicken Wings: మనం ఇంతవరకు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటాం. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన వస్తువులు, సొమ్మును పక్కదారి పట్టించి.. జేబులు నింపుకుంటారు. ఇలా కోట్లకు కోట్లు కొట్టేసి.. చివరికి ఎప్పుడో ఒకప్పుడు దొరికిపోతారు. అప్పుడు వాళ్లు కూడబెట్టిన ఆస్తులు చూస్తే.. వారి జీతానికి, ఆస్తులకు సంబంధమే ఉండదు. అయితే ఇలా దొరికిపోయిన వారిపై కేసులు, శిక్షలు అంటూ పెద్ద తతంగం ఉంటుంది. అయితే విద్యార్థులకు అందాల్సిన చికెన్ ముక్కలను కొట్టేసిన ఓ మహిళ.. చివరికి కటకటాల వెనక్కి వెళ్లింది. చికెన్ దొంగతనం చేసిన ఆ మహిళకు కోర్టు ఏకంగా 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.
అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉన్న హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్‌లో భారీ కుంభకోణం తాజాగా వెలుగు చూసింది. హార్వే స్కూల్ డిస్ట్రిక్ట్ ఫుడ్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ తరఫున స్కూల్ విద్యార్థులకు అందించాల్సిన చికెన్ వింగ్స్‌ను పక్కదారి పట్టించిన ఓ మహిళా ఉద్యోగి చివరికి దొరికిపోయింది. దీంతో కోర్టు ఆమెకు 9 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కొవిడ్ సమయంలో విద్యార్థులకు అందించాల్సిన ఆ చికెన్ వింగ్స్‌ను కాస్తా మహిళా ఉద్యోగి పక్కదారి పట్టించింది. స్కూల్ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన పథకంలో భారీగా అక్రమాలు వెలుగు చూశాయి. మొత్తంగా 1.5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా రూ.12.5 కోట్ల విలువైన చికెన్ వింగ్స్‌ను చోరీ చేసినట్లు విచారణలో తేలింది.