మహారాష్ట్ర సీఎం ప్రకటనే తరువాయి అనుకుంటున్న సమయంలో.. ఒక్కసారిగా మహాయుతి నేతల కీలక సమావేశం రద్దవ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే అమావాస్య కారణంగానే మహాయుతి మీటింగ్ రద్దైనట్లు తెలుస్తోంది. రెండ్రోజులపాటు శుభముహూర్తాలు లేకపోవడం సమావేశాన్ని క్యాన్సిల్ చేసినట్లు సమాచారం అందుతోంది. ఆదివారం రాత్రి ఢిల్లీ లేదా ముంబై ఈ సమావేశం నిర్వహంచనున్నట్లు తెలుస్తోంది.
మీటింగ్ రద్దవ్వడంతో షిండే సతారాలోని తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. రెండ్రోజులపాటు అక్కడే ఉండి… ఆదివారం నాటి మీటింగ్‌కు హాజరవుతారంటూ శివసేన నేతలు చెబుతున్నారు. అయితే షిండే ఇంకా అసంతృప్తితో ఉన్నారని పొలిటికల్ సర్కిల్‌లో రకరకాల చర్చలు వినిపిస్తున్నాయి. షిండే అలిగారని… ప్రభుత్వ ఏర్పాటు చర్యలపై ఆయన అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే విషయంపై ఎమ్మెల్యే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ శిర్సత్ కీలక వ్యాఖ్యలు చేశారు. షిండేకు ఉపముఖ్యమంత్రి పదవి తగదని… ఇదివరకే ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అది సరికాదంటూ సంజయ్ అనడం చర్చనీయాంశమైంది.
ఇక కూటమిలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులపై ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ.. కొన్ని మంత్రి పదవుల కేటాయింపు విషయంలో మిత్రపక్షాల మధ్య ఇంకా స్పష్టత రానట్లు తెలుస్తోంది. గతంలో మాదిరి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, షిండేలు పదవులు చేపట్టడం దాదాపు ఖరారు అయినట్లే కనిపిస్తుంది.
కేబినెట్‌లో బీజేపీకి 22 బెర్త్‌లు, శివసేనకు 12, ఎన్‌సీపీకి 9 పోర్ట్‌ఫోలియోలు దక్కే అవకాశం ఉంది. కీలక హోంశాఖను బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే శివసేనకు పట్టణాభివృద్ధి, ప్రజాపనుల శాఖలు.. ఎన్సీపీకి ఆర్థిక శాఖను కేటాయించే ఛాన్స్ ఉంది. డిసెంబరు 2న ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.