సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో ప్రతిష్టాత్మక కార్యక్రమంవైపు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో.. తెలంగాణ ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీపికబురు వినిపించారు. తెలంగాణలో విద్యార్థులకు మెరుగైన విద్యా అందించటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమమైన యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే.. ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పైలెట్ ప్రాజెక్టు కింద కొడంగల్, మధిరలో క్యాంపస్‌లు నిర్మిస్తున్నారు. ఆ తర్వాత.. అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే.. ఆదివారం (అక్టోబర్ 06న) రోజున సచివాలయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ నమూనాలు విడుదల చేశారు. ఇందులో భాగంగా మాట్లాడిన కోమడిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద ఆసక్తికర కామెంట్ చేశారు.
రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దసరాకు ముందు రోజు అంటే అక్టోబర్ 11వ తేదీన ఈ ఇండిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్నట్టు ప్రకటించారు. 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మించనున్నట్టు తెలిపారు. ఇందులో ఇంగ్లీషు మీడియంతో.. 10+2 వరకు విద్యా బోధించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలో చదువుతున్న 6 లక్షల మంది పిల్లల భవిష్యత్తు కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదని వివరించారు. ప్రస్తుతం 22 నియోజకవర్గాల్లో స్థలాలు కూడా గుర్తించామని తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా 1023 స్కూళ్లు కట్టించనున్నట్టు ప్రకటించారు.