హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రహదారిపై ప్రతి నిత్యం కొన్ని వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. దేశంలో అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో హైదరాబాద్-విజయవాడ నేషనల్ హైవే ఒకటి. అయితే ఈ రహదారి ప్రస్తుతం నాలుగు వరుసలుగా ఉండగా.. వాహనాల రద్దీ కారణంగా ప్రతినిత్యం పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో రహదారి విస్తరణకు కేంద్రం డిసైడ్ అయింది. ఆరు వరుసలుగా విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే రహదారిపై 17 చోట్ల బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ అండర్‌పాసులు, ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు.
తాజాగా.. రహదారి విస్తరణపై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. హైవే విస్తరణ పనులను గడువు కంటే ముందే పూర్తిచేయాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు సూచించారు. ప్రతివారం జాతీయ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలన్నారు. బుధవారం ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి.. రాష్ట్రంలో చేపట్టనున్న అన్ని జాతీయ రహదారుల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. విజయవాడ-నాగ్‌పుర్ నేషనల్ హైవేకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మంత్రి కోమటిరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణ సంస్థతో తాను మాట్లాడతానని చెప్పిన మంత్రి.. భూసేకరణకు ఇబ్బందులు లేనిచోట పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.
Amaravati News Navyandhra First Digital News Portal