Nara Lokesh sorry to complainant:ఏపీ మంత్రి నారా లోకేష్ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. తన తరుఫున, తన విభాగం తరుఫున అతనికి క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రకటించారు. అసలు సంగతిలోకి వస్తే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి లోకేష్ పెద్ద పీట వేస్తున్నారు. ప్రజాదర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. సత్వర పరిష్కారం కోసం కృషిచేస్తున్నారు. అయితే మంగళగిరి నియోజకవర్గం ప్రజలకు ప్రజాదర్బార్ ద్వారా అందుబాటులో ఉంటున్న నారా లోకేష్.. మిగతా రాష్ట్రంలోని ప్రజానీకానికి సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంటున్నారు. ఈ మాధ్యమాల ద్వార తన దృష్టికి వస్తున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లాకు చెందిన రిషిక్ అనే వ్యక్తి ఓ సమస్యను నారా లోకేష్ దృష్టికి ఇటీవల తీసుకువచ్చారు. ప్రజాదర్బార్ వేదికగా దీని గురించి ఫిర్యాదు చేశారు. ఆగస్ట్ 7వ తేదీ సమస్య గురించి తెలియజేసిన వెంటనే.. దానిని నమోదు చేసుకున్నారు. విషయాన్ని రిజిస్టర్ చేసుకున్నట్లు రిషిక్‌కు సైతం మెసేజ్ చేశారు. అయితే తొమ్మిదో తేదీ ఈ సమస్య పరిష్కారమైందన్నట్లుగా రిషిక్‌కు మరో మెసేజ్ వచ్చింది. ఈ విషయాన్నే రిషిక్ నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజాదర్బార్‌లో సమస్య గురించి చెప్పాక పరిష్కారం చేస్తామని ప్రొసీడింగ్స్ ఇచ్చారని.. ఆగస్ట్ 9న సమస్య పరిష్కారమైందని రిడ్రెస్డ్ మెసేజ్ ఇచ్చినట్లు ట్వీట్ చేశారు.
అయితే సమస్య అలాగే ఉందన్న రిషిక్.. పరిష్కరించకుండానే పరిష్కరించినట్లు మెసేజ్ పెట్టారంటూ నారా లోకేష్‌ను ట్యాగ్ చేశారు. ఇలాంటి వాటి మీద కొంచెం శ్రద్ద చూపాలని ఆశిస్తున్నామని ట్వీట్ చేశారు. అలాగే మున్సిపల్ ఉద్యోగులు, కలెక్టర్ ఆఫీసులోని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే రిషిక్ ట్వీట్‌కు మంత్రి నారా లోకేష్ స్పందించారు. జరిగిన తప్పిదానికి తన విభాగం తరుఫున క్షమించాలని కోరారు. సంబంధిత అధికారులతో తన టీమ్ మాట్లాడుతుందన్న నారా లోకేష్.. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.