తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ దర్యాప్తు!.. నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

తిరుపతి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతోంది. తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన సంచలన ప్రకటనతో.. ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చంద్రబాబు ఆరోపణలకు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం దీనిపై స్పందించిన వైఎస్ జగన్.. తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ విధానాలను తామేమీ మార్చలేదన్న వైఎస్ జగన్.. ఇదంతా కట్టుకథ అంటూ, డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఆరోపించారు. అయితే వైఎస్ జగన్ విమర్శలకు.. మంత్రి నారా లోకేష్ కౌంటర్ ఇచ్చారు.

ఇందులో డైవర్షన్ పాలిటిక్స్ ఏముందంటూ నారా లోకేష్ ప్రశ్నించారు. తిరుమల లడ్డూ తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని రిపోర్టులు సైతం చెప్తున్నాయని నారా లోకేష్ అన్నారు. తామేమీ నిరాధార ఆరోపణలు చేయలేదని.. సాక్ష్యాలను ప్రజల ముందు ఉంచినట్లు చెప్పారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానిజాలను వెలికి తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు లోకేష్. ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ గురించి చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారు. సీబీఐ విచారణ మీద సీఎం త్వరలోనే ప్రకటన ఇస్తారని అన్నారు. అయితే సీబీఐ విచారణతోనే ఆగిపోమన్న లోకేష్.. కారకులను శిక్షించి, తిరుమలను ప్రక్షాళన చేస్తామన్నారు.

మరోవైపు వైఎస్ జగన్ కంటే ముందు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా చేశారన్న నారా లోకేష్.. ఎవరూ కూడా తిరుమల విషయంలో జోక్యం చేసుకోలేదన్నారు. టీటీడీ స్వతంత్ర సంస్థగా చెప్పిన నారా లోకేష్.. కేవలం ఛైర్మన్, ఈవోలను మాత్రమే ప్రభుత్వం నియమిస్తుందని చెప్పారు. ఆపై టీటీడీ స్వతంత్రంగా పనిచేస్తుందని వివరించారు. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీపైనా త్వరలోనే ఓ కొత్త పాలసీని తెస్తామని నారా లోకేష్ వెల్లడించారు. దీనిపై కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. కల్తీ ఘటనలు పునరావృతం కాకుండా పాలసీని తెస్తామని స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ విషయంపై తన సవాలును వైసీపీ నేతలు స్వీకరించలేకపోయారన్న లోకేష్.. ఎందుకు చర్చకు రాలేదో జవాబు చెప్పాలన్నారు.

About amaravatinews

Check Also

కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *