ఒకేసారి 3 శుభవార్తలు చెప్పిన ప్రముఖ టెక్ సంస్థ.. అంచనాల్ని మించి లాభాలు.. ఉద్యోగులకు పండగే!

L and T Technology Services: ప్రముఖ ఇంజినీరింగ్ సేవల సంస్థ ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై- సెప్టెంబర్ త్రైమాసికానికి గానూ ఫలితాల్ని ప్రకటించింది. అక్టోబర్ 16న ఫలితాల్ని వెల్లడించగా.. నికర లాభం అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే 1.3 శాతం మేర పెరిగి రూ. 319.60 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఈ సమయంలో లాభం రూ. 315.4 కోట్లుగా ఉండేది. ఇక సంస్థ కార్యకలాపాల ఆదాయం రెండో త్రైమాసికంలో 7.8 శాతం మేర పుంజుకొని రూ. 2573 కోట్లకు చేరింది. ఇది అంతకుముందు ఇదే సమయంలో రూ. 2386 కోట్లుగానే ఉండేది. ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్లో వృద్ధి కారణంగానే మంచి ఫలితాలు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.

ప్రముఖ ఇంజీనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ దిగ్గజం ఎల్ అండ్ టీ సబ్సిడరీ అయినటువంటి ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ 2024-25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో 8 నుంచి 10 శాతం మేర ఆదాయ వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు కంపెనీ ఎండీ అండ్ సీఈఓ అమిత్ చాధా. కార్యకలాపాల మార్జిన్ 17.1 శాతం నుంచి 15.1 శాతానికి తగ్గింది. ఆర్థిక సంవత్సరం మొత్తం మీద దీనిని 16 శాతం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఫలితాల సందర్భంగానే కంపెనీ 3 కీలక ప్రకటనలు చేసింది. ముందుగా ఉద్యోగులకు వేతనాల పెంపుపై శుభవార్త అందించింది. వార్షిక ప్రాతిపదికన వేతన పెంపు ప్రక్రియను అక్టోబర్ నెలలోనే మొదలు పెట్టనున్నట్లు తెలిపారు అమిత్. గత కొంత కాలంగా ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. వేతనాల పెంపును చాలా కంపెనీలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కంపెనీ ఇప్పుడు శుభవార్త అందించింది. మరోవైపు.. ఈ ఆర్థిక సంవత్సరంలో 2 వేల మందికిపైగా ఫ్రెషర్లను (తాజా ఉత్తీర్ణులు) నియమించుకోబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఎంపిక చేసిన వారికి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నట్లు చాధా తెలిపారు.

ఉద్యోగుల సంఖ్య సమీక్షా త్రైమాసికంలో 121 పెరిగి మొత్తం 23,698 కి పెరిగింది. ప్రస్తుతం ఐటీ కంపెనీల్ని ఇబ్బంది పెడుతున్న అట్రిషన్ రేటు (సిబ్బంది వలసలు) 14.3 శాతానికి పరిమితమైంది. మరోవైపు.. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కూడా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఒక్కో షేరుపై రూ. 17 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. దీనికి అక్టోబర్ 25 రికార్డ్ డేట్‌గా పేర్కొంది.

మరో ఐటీ కంపెనీ ఎంఫసిస్ కూడా త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. కిందటి ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంతో చూస్తే నికర లాభం 8 శాతం పుంజుకొని రూ. 423.3 కోట్లుగా వచ్చింది. కిందటి త్రైమాసికంతో చూస్తే కూడా 4.7 శాతం లాభం పెరిగింది. ఆదాయం 7.90 శాతం పెరిగి రూ. 3536 కోట్లుగా ఉంది. మంచి ఫలితాల నేపథ్యంలో ఈ స్టాక్ దూసుకెళ్తోంది. మార్కెట్లు పడిపోతున్నా.. ఇంట్రాడేలో ఇది దాదాపు 6 శాతం పెరిగి రూ. 3091 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. మార్కెట్ విలువ రూ. 58.23 వేల కోట్లుగా ఉంది.

About amaravatinews

Check Also

Jio 5G Voucher: జియో బంపర్ ఆఫర్.. రూ.601కే ఏడాదంతా అన్‌లిమిటెడ్ 5జీ డేటా!

Jio 5G Voucher: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *