అంబానీ రిలయన్స్ కంపెనీ కీలక ప్రకటన.. 100 షేర్లకు మరో 100 షేర్లు ఫ్రీ.. దూసుకెళ్లిన స్టాక్!

భారతదేశంలో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చేది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. భారత అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ దీనికి యజమాని. ఇంధనం, రిటైల్, టెలికాం, మీడియా ఇలా ఎన్నో రంగాల్లో తన కార్యకలాపాల్ని విస్తరించి అగ్రపంథాన కొనసాగుతున్నారు. 100 బిలియన్ డాలర్లకుపైగా ఆస్తి ఈయనకు ఉంది. ఇక గురువారం రోజు రిలయన్స్ వార్షిక సాధారణ సర్వసభ్య సమావేశం వేళ కీలక ప్రకటనలు వచ్చాయి. సమావేశానికి ముందుగానే.. బోనస్ షేర్ల జారీ గురించి సమాచారం అందింది. ఈసారి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనున్నట్లు తెలిపింది. అయితే దీనికి బోర్డు సభ్యులు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అందుకోసం సెప్టెంబర్ 5న బోర్డు సమావేశం ఏర్పాటు చేసి.. బోనస్ షేర్ల జారీకి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో ఆగస్ట్ 29న తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్.

ఆయిల్ నుంచి టెలికాం సమ్మేళనాల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవలి ఆర్థిక సంవత్సరంలో అదిరిపోయే రిటర్న్స్ అందుకుంది. అందుకే గిఫ్ట్ కింద షేర్ హోల్డర్లకు బోనస్ షేర్లను జారీ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. 1:1 రేషియోలో బోనస్ షేర్లు అంటే.. ఇప్పుడు ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ఒక్కో షేరుకు అదనంగా మరో షేరు వచ్చి చేరుతుంది. ఈ లెక్కన 100 షేర్లు ఉంటే.. ఆ సంఖ్య 200 షేర్లకు చేరుతుంది. ఎలాంటి అదనపు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ పెట్టుబడి మాత్రం అడ్జస్ట్ అవుతుందని చెప్పొచ్చు.

రిలయన్స్ ఇండస్ట్రీస్ గతంలో కూడా 2 సార్లు బోనస్ షేర్లు జారీ చేయగా.. ఒకసారి స్టాక్ స్ప్లిట్ (షేర్ల విభజన) జరిగింది. 2009 నవంబర్ 26న 1:1 రేషియోలో బోనస్ షేర్లు ప్రకటించగా.. తర్వాత చివరగా 2017 సెప్టెంబర్ 7న కూడా బోనస్ షేర్లు వచ్చాయి. ఇక్కడ కూడా 1:1 నిష్పత్తిలోనే జరిగాయి. ఇప్పుడు అంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత సరిగ్గా అదే నిష్పత్తిలో బోనస్ షేర్లు ఇష్యూ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక 2000, జనవరి 1న స్టాక్ స్ప్లిట్ కూడా జరిగింది. ఏదైనా సంస్థ తన క్యాపిటల్ రిజర్వ్స్ నుంచి షేర్ హోల్డర్లకు తమ లాభాల్ని, ఆదాయాన్ని పంచేందుకు ఇలా డివిడెండ్లు, బోనస్ షేర్లు, స్టాక్ స్ప్లిట్, షేర్ల బైబ్యాక్ వంటివి చేపడుతుందని చెప్పొచ్చు.
బోనస్ షేర్లపై ప్రకటన నేపథ్యంలో రిలయన్స్ స్టాక్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఇంట్రాడేలో దాదాపు 2 శాతానికిపైగా పెరిగి రూ. 3074 వద్ద గరిష్ట విలువను నమోదు చేసింది. ప్రస్తుతం 1.70 శాతం లాభంతో రూ. 3048 వద్ద ఉంది. అయితే ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట విలువ రూ. 3217.60 కాగా.. కనిష్ట విలువ రూ. 2220.30 గా ఉంది. మార్కెట్ విలువ రూ. 20.63 లక్షల కోట్లుగా ఉంది. కొద్ది నెలల కిందట ఈ రిలయన్స్ ఎం క్యాప్ రూ. 21 లక్షల కోట్ల మార్కు కూడా దాటిన సంగతి తెలిసిందే. బోనస్ షేర్ల ప్రకటనకు తోడు.. రిలయన్స్ ఏజీఎం నేపథ్యంలో ఇన్వె్స్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు.

About amaravatinews

Check Also

ఆకర్షణీయమైన ప్యాకేజీలకు ఆకర్షితులయ్యారో.. గోవిందా! విహార యాత్రల పేరుతో నయా దందా

టూర్స్ ట్రావెల్స్ ప్యాకేజీల పేరుతో ఈమధ్య కాలంలో దేశ వ్యాప్తంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. ఇప్పటికే పలు చోట్ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *