జనసేన పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలకు కీలక పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర పార సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు శాసన సభాపతికి డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమాచారం అందించారు. పార్టీ చీఫ్ విప్‌గా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్భులుగా విశాఖ సాత్ ఎమ్మెల్యే చెన్నుబోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ , రాజోలు ఎమ్మెల్యే శ్రీ దేవ వరప్రసాద్ నియమించారు. ఈ విషయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అసెంబ్లీలో ప్రకటించారు.
దిలా ఉంటే జనసేన పార్టీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసింది. పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారిక విప్‌లుగా ప్రకటించాలని లేఖలో కోరారు. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌లను విప్‌లుగా నియమించాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ నియామకాలపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, చీఫ్ విప్, ఇతర పదవుల్ని భర్తీ చేశారు. అయితే అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా పవన్ కళ్యాణ్ ఉన్నారు.
కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు చంద్రబాబు కేబినెట్‌లో మంత్రులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉంటే.. మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. మిగిలిన విప్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు.. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో కలిసి చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.
మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు ఇవ్వడం శుభపరిణామం అన్నారు పవన్ కళ్యాణ్. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కూటమిలో ఎవరైనా తప్పులు చేస్తే.. అది మొత్తం ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందన్నారు. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలైనా సరే.. తప్పు చేస్తే వారిని వదులుకోవడానికి కూడా తాను వెనకడుగు వేయనన్నారు. ఎవరైనా తప్పు చేస్తే తాము శిక్ష వేస్తామనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవం రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని.. అందుకు తాము తప్పనిసరిగా అండగా ఉంటామన్నారు డిప్యూటీ సీఎం.
ఆంధ్రప్రదేశ్ రాజధాని భవిష్యత్తులో కూడా అమరావతినే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో మరింత ముందుకెళ్లాలన్నారు. తనకు ప్రత్యర్థి అయినా వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన మంచి పనులను చంద్రబాబు పొగిడారని.. అదీ చంద్రబాబు వ్యక్తిత్వమని ప్రశంసించారు. రాజకీయాల్లో ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో.. తనలాంటి వాళ్లు కూడా నేర్చుకునే అవకాశం కలుగుతుందన్నారు. ఆయన పాలన ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.