Nara Bhuvaneswari Donation for Anna canteens: పంద్రాగస్టును పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేపటి నుంచి అన్న క్యాంటీన్లు తెరుచుకోనున్నాయి. వంద అన్న క్యాంటీన్లను ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. గుడివాడలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా తొలి అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్ట్ 16న మిగతా 99 అన్న క్యాంటీన్లను మంత్రులు ప్రారంభించనున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ అయిన నారా భువనేశ్వరి భారీ విరాళం అందించారు. ఎన్టీఆర్ ట్రస్టు తరుఫున నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ. కోటి విరాళంగా అందించారు.
కోటి రూపాయల విరాళం తాలూకు చెక్కును నారా భువనేశ్వరి ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు అందజేశారు. నిరుపేదలు, కూలీలు, కార్మికుల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌లు ఎంతో గొప్ప కార్యక్రమమని నారా భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. విరాళం అందించిన విషయమై ట్వీట్ చేసిన భువనేశ్వరి.. అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్‌లో ఆకలి అనే పదం వినపడకూడదనే మహోన్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న క్యాంటీన్లను మళ్లీ పునఃప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే అన్న క్యాంటీన్లు మొదలుకావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. పేదల ఆకలి తీర్చే ఈ మహత్తర కార్యక్రమం కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరుపున కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా అందిస్తున్నట్లు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నిరుపేదల ఆకలి తీర్చే ఈ మహాయజ్ఞంలో మీ వంతు సహకారాన్ని అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మరోవైపు విజయవాడకు చెందిన ఓ సంస్థ కూడా అన్న క్యాంటీన్లకు మంగళవారం భారీ విరాళం అందించింది. విజయవాడకు చెందిన శ్రీలక్ష్మీ వెంకటేశ్వర డెవలపర్స్ సంస్థ కోటి రూపాయలను అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం విరాళంగా అందించింది. ఈ సంస్థ అధినేత పెనుమత్స శ్రీనివాసరాజు.. చంద్రబాబును సచివాలయంలో కలిసి విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే వచ్చే ఐదేళ్లపాటు ప్రతి సంవత్సరం కోటి రూపాయలు చొప్పున అన్న క్యాంటీన్ల కోసం విరాళంగా అందిస్తానని ప్రకటించారు. పెనుమత్స శ్రీనివాసరాజును ఈ సందర్భంగా చంద్రబాబు అభినందించారు. పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ల కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు.