ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి అమరావతి ప్రాంతంలో పర్యటించారు. అది కూడా ఎలాంటి హంగు, ఆర్భాటాలు, భద్రత లేకుండా రాజధాని ప్రాంతంలో కలియ తిరిగారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే రైతులతో భువనేశ్వరి ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాజధాని అమరావతిలో నారా భువనేశ్వరి సందర్శన ఆసక్తిని కలిగిస్తోంది. వెలగపూడి రెవెన్యూ పరిధిలో తన నివాసానికి చంద్రబాబు గతంలో కొనుగోలు చేసిన 25 వేల చదరపు గజాల స్థలాన్ని పరిశీలించేందుకు ఆమె నిన్న సాయంత్రం అమరావతి లో పర్యటించారు. త్వరలోనే అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గతంలోనే ముఖ్యమంత్రి అనేక సార్లు తెలిపారు. ఆ స్థలాన్ని తన కుటుంబసభ్యులే కొనుగోలు చేశారని, ఆ నిర్మాణ బాధ్యతలను కూడా భువనేశ్వరి నే చూస్తారని పలు సందర్భాలలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. ఈ నేపద్యంలో సాదాసీదాగా, ప్రత్యేక భద్రత లేకుండా వచ్చిన భువనేశ్వరి సర్వేయర్లతో కలిసి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. నిన్నసాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ6 రోడ్డుకు సమీపంలో ఉన్న ఆ స్థలానికి చేరుకున్న ఆమె దాదాపు 20 నిమిషాల పాటు పరిశీలన చేశారు. సర్వేయర్లు ఆ స్థలానికి సంబంధించిన ప్లాట్ మ్యాప్, సరిహద్దులను వివరించగా, భువనేశ్వరి ఆ స్థలాన్ని ఆసక్తిగా గమనించారు. ప్లాట్ చుట్టూ ఉన్న జెండాలను చూపుతూ, భవిష్యత్తులో చేపట్టవలసిన పనుల గురించి చర్చించారు.
స్థానిక రైతులతో ముచ్చట
ఈ సందర్శన సమయంలో అటుగా వెళ్తున్న వెలగపూడి రైతులు భువనేశ్వరితో ముచ్చటించారు. తమ గ్రామంలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం జరిగి పాలన ఇక్కడి నుంచే ప్రారంభమైనప్పుడు ఎంతో గర్వంగా అనిపించిందని, ఇప్పుడు చంద్రబాబు తన నివాసానికి తమ పరిధిలో స్థలం కొనుగోలు చేయడం మరింత ఆనందాన్ని కలిగించిందని వారు తెలిపారు. అలాగే, ఈ ప్రాంతంలో త్వరలోనే నిర్మాణాలు ప్రారంభం అవుతాయని తెలుసుకోవడం తమకు భవిష్యత్తులో మరింత అభివృద్ధి తేవొచ్చనే నమ్మకాన్ని కలిగించిందన్నారు.
అందరి సహకారం అవసరమన్న సీఎం సతీమణి
ఈ సందర్భంగా భువనేశ్వరి, రైతుల మాటలు శ్రద్ధగా వినుతూ, వారి అభిప్రాయాలను పంచుకున్నారు. నాటి పాత రోజులను గుర్తు చేసుకుంటూ రాజధాని అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్శన రైతులకు, స్థానికులకు కొత్త ఉత్సాహాన్ని కలిగించి, అమరావతి రాజధాని అభివృద్ధిలో మరింత విశ్వాసాన్ని పెంచింది.