మరొకొద్ది గంటల్లో శ్రీహరికోట నుంచి GSLV-F16 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నారు. ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నిసార్ ఉపగ్రహం సాయంత్రం 5:40కి GSLV-F16 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన NISAR.. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్-ఫ్రీక్వెన్సీ రాడార్‌తో పనిచేసే ఉపగ్రహం. ఇది L -బ్యాండ్, S-బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్‌ను భూమికి పంపిస్తుంది. నిసార్‌కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోలను తీసే సామర్థ్యం ఉంది.
నిసార్ ఉపగ్రహం కక్ష్యలోకి చేరుకున్నాక…అడవులు, మైదానాలు, కొండ చరియలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటిని జల్లెడ పడుతుంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండ చరియలు విరిగిపడే ముప్పును, అగ్నిపర్వతాల పేలుళ్లను ముందస్తుగా గుర్తించి, సమాచారాన్ని అందజేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
రేయింబవళ్లు భూమిపై కన్నేసి ఉంచే నిసార్ శాటిలైట్…అధిక రెజల్యూషన్‌తో ఫొటోలు, డేటా అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రతి 12 రోజులకు ఒకసారి భూమిని కంప్లీట్‌గా స్కాన్ చేస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా…ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలకు ఉచితంగా సేవలు అందుతాయి. ఇస్రో-నాసా జాయింట్ వెంచర్ అయిన ఈ ఉపగ్రహం బరువు 2,393 కేజీలు. భూమికి 743 కిలోమీటర్ల దూరంలోని లియో ఆర్బిట్‌లో నిసార్‌ను ప్రవేశపెడుతుంది రాకెట్.
ఈ నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన L బ్యాండ్ రాడార్ ,ఇస్రోకు చెందిన S బ్యాండ్ రాడార్లను అమర్చి, ఈ రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపార్చర్ రాడార్‌ను, 12 మీటర్ల వ్యాసం కలిగిన యాంటెన్నాను ఏర్పాటుచేశారు. ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం.
నిసార్ ఉపగ్రహం లాంచ్ సందర్భంగా, తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ దేవాలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ టీమ్ సందర్శించింది. GSLF F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. ఈ శాటిలైట్‌ని ఎర్త్ అబ్జర్వేషన్ కోసం ప్రయోగిస్తున్నామని ఇస్రో చైర్మన్ చెప్పారు. నిసార్ ప్రయోగంతో…విశ్వ వీధిలో భారత్ మరోసారి విజయకేతనం ఎగురవేయనుంది.