మణిపూర్‌లో అధికారంలో ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఏడాదికి పైగా ఆ రాష్ట్రంలో తెగల మధ్య హింసాత్మక సంఘటనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. తాజాగా ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేషనల్ పీపుల్స్ పార్టీ -ఎన్‌పీపీ తన మద్దతును ఉపసంహరించుకుంది. అయితే ఇప్పటికే కుకీ పీపుల్స్ పార్టీ కూటమి నుంచి వైదొలగగా.. ఇప్పుడు ఎన్‌పీపీ కూడా అదే బాటలో బయటికి రావడం మణిపూర్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌ను.. పదవి నుంచి తొలగించి కొత్త ముఖ్యమంత్రిని నియమించాలనే డిమాండ్లు అధికార కూటమిలోని కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే బీజేపీ హైకమాండ్‌కు సూచిస్తుండటం.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
మణిపూర్‌లో నెలకొన్న హింస, జాతుల మధ్య ఘర్షణను తగ్గించి.. పరిస్థితులను సాధారణ స్థాయికి తీసుకురావడంలో బీరెన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. కూటమి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఎన్‌పీపీ తీవ్ర ఆరోపణలు గుప్పించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన ఎన్‌పీపీ.. గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో పరిస్థితులు మరింత దిగజారినట్లు వెల్లడించింది. ఈ హింసాత్మక సంఘటనల్లో ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు వివరించింది. మణిపూర్‌లో పరిస్థితులు రాకపోవడం, అందుకు కావాల్సిన చర్యలను తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని.. అందుకే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు తీసుకున్నట్లు ప్రకటించింది.
అయితే మణిపూర్ ప్రభుత్వానికి ఎన్‌పీపీ మద్దతును ఉపసంహరించుకున్నా.. బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి మాత్రం ఎలాంటి ఢోకా లేదు. 60 మంది శాసన సభ్యులు ఉన్న మణిపూర్ అసెంబ్లీలో బీజేపీకి సొంతంగా 37 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అంతేకాకుండా మొత్తం ఎన్డీఏ కూటమికి 53 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. అయితే ప్రస్తుతం కూటమి నుంచి బయటికి వచ్చిన ఎన్‌పీపీకి కేవలం ఏడుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దీంతో ఎన్‌పీపీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బీరెన్ సింగ్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇక నాగా పీపుల్స్ ఫ్రంట్ -ఎన్‌పీఎఫ్‌కు ఐదుగురు ఎమ్మెల్యేలు, జేడీయూ పార్టీ నుంచి ఒకరు, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు కూడా బీరెన్ సింగ్ ప్రభుత్వానికి ఉంది. మరోవైపు.. ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు, కుకీ పీపుల్స్ పార్టీ-కేపీఏకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే బీరెన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన కుకీ పీపుల్స్ పార్టీ.. హింసాత్మక సంఘటనలన నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.