తిరుమలలో విషాదం జరిగిది.. శ్రీవారి దర్శనానికి వెళుతూ నవ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. అలిపిరి మెట్లదారిలో శ్రీవారి దర్శనానికి నడిచి వెళుతుండగా.. గుండెపోటుతో చనిపోయాడు. నవీన్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.. ఆయనకు 15 రోజుల క్రితం వివాహమైంది. నవీన్ శుక్రవారం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.. అక్కడి నుంచి కాలినడకన అలిపిరి మెట్లమార్గంలో తిరుమలకు బయలుదేరారు. నడుకుకుంటూ 2,350వ మెట్టు దగ్గరకు రాగానే.. నవీన్ అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న భద్రతా సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వెంటనే నవీన్‌ను అంబులెన్స్ ద్వారా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యమైంది.. నవీన్ ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నవీన్‌ది తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతంకాగా.. ఆయన బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ ఘటనంపై తిరుమల టూటౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15 రోజుల క్రితమే వివాహమై.. శ్రీవారి దర్శనానికి వెళుతుండగా ఇలా జరగడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.