కేంద్రం విజయవాడకు సంబంధించిన పలు రైలు, హైవే ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విజయవాడకు తూర్పు బైపాస్ కూడా వచ్చింది. అయితే కేంద్రం ఓ షరతు విధించింది. లాజిస్టిక్ హబ్ కోసం తమకు 100 ఎకరాలు భూసేకరణ చేసి కేటాయించాలని కోరింది. ఈ క్రమంలో కొండపల్లిలో హబ్ ఏర్పాటుకు అడుగులుపడుతున్నాయి. ఈ విషయాన్ని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి.. భూసేకరణ జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం మేరకు.. నేషనల్ హైవే ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న లాజిస్టిక్ హబ్ కోసం కొండపల్లి సమీపంలో స్థలాలను కేటాయించేందుకు రంగం సిద్ధమైందంటున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో లాజిస్టిక్ హబ్ ఉండాలనే ఉద్దేశంతో.. ఇక్కడ స్థల సేకరణకు ఎన్‌హెచ్‌ఏఐ ఆసక్తి చూపిస్తోందట.. ప్రభుత్వం దీనిపై తగిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అధికారికంగా ఏపీ ప్రభుత్వం నుంచి ఈ హబ్‌కు భూములపై ప్రకటన రావాల్సి ఉంది.
చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి ఆరు వరసలగా విస్తరించనున్న సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో విజయవాడ నగరానికి పశ్చిమ వైపు బైపాస్ నిర్మిస్తున్నారు. 2014-2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విజయవాడకు రింగు రోడ్డుగా పశ్చిమపైపు తరహాలోనే తూర్పువైపు కూడా రోడ్డు నిర్మించాలని కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు అప్పటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం తెలపగా.. ఎన్‌హెచ్‌ఏఐ భూసేకరణ భారం రాష్ట్ర ప్రభుత్వాన్ని భరించాలని కోరింది. అయితే అప్పటి ఏపీ ప్రభుత్వం నిరాకరించగా.. తాము తూర్పు బైపాస్ నిర్మించాలంటే లాజిస్టిక్ హబ్ కోసం 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని రాష్ట్రాన్ని కోరింది. అప్పుడు ప్రభుత్వం ఓకే చెప్పగా.. గత ఐదేళల్లోఈ ప్రతిపాదన ముందుకు సాగలేదు.
తూర్పు బైపాస్‌కు సంబంధించి నివేదిక తయారు చేసి.. మూడు ప్రతిపాదనల్ని ఏపీ ప్రభుత్వానికి పంపారు. వీటిలో ఒకదానికి చంద్రబాబు సర్కార్ ఓకే చెప్పాల్సి ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం చేపట్టేలా ఏర్పాట్లు చేస్తోంది. తమకు లాజిస్టిక్ హబ్ కోసం వంద ఎకరాల స్థలం కావాలని.. నేషనల్ హైవే, రైల్వే మార్గం కనెక్టవిటీకి దగ్గరలో ఉండాలని కేంద్రం కోరింది. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ గుంటూరు, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాలను పరిశీలించింది. చివరికి కొండపల్లి ప్రాంతం అనువుగా ఉన్నట్లు గుర్తించింది. ఎందుకంటే ఇక్కడ జెన్కో స్థలాలు ఉన్నాయి.. వీటిలో భూమి కేటాయించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆ భూముల్ని జెన్కో నుంచి ఏపీ సీఆర్డీఏకు బదలాయించి అక్కడి నుంచి నేషనల్ హైవే సంస్థకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే జెన్కోకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాల్సి ఉంటుంది..తద్వారా ప్రభుత్వంపై భారం ఉండదని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.