Nisha Madhulika: అభిరుచి అవసరంతో పెనవేసుకున్నప్పుడు అది జీవితాలను మార్చే, వృత్తిని సృష్టించే ఒక ఆయుధంగా మారుతుంది. అది సామ్రాజ్యాలను సృష్టించే శక్తిని కలిగి ఉంటుంది. వంటపై ఉన్న మక్కువ ఒక టీచర్‌ను ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. కాలక్షేపం కోసం మొదలు పెట్టి ఇప్పుడు ఎందరికో శిక్షణ ఇచ్చే స్థాయికి తీసుకెళ్లింది. 65 ఏళ్ల వయసులో అత్యంత ధనిక భారతీయ మహిళా యూట్యూబర్‌గా మార్చింది. ఆమెనే యూట్యూబ్‌లో సంచలనంగా మారిన నిషా మధులిక. ఆమె గురించి కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇటీవలే రిపబ్లిక్ వరల్డ్‌లో ప్రచురితమైన కథనం ప్రకారం.. ప్రముఖ యూట్యూబర్, పాపులర్ ఫుడ్ వెబ్‌సైట్ ఓనర్ నిషా మధులిక సంపద విలువ రూ.43 కోట్లుగా ఉంటుందని అంచనా. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి 14.5 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారత్‌లోని టాప్ మహిళా యూట్యూబర్లలో ఒకరిగా ఉన్నారు. మధులిక వాళ్లది ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మధ్య తరగతి కుటుంబం. చిన్నప్పటి నుంచే ఆమెకు వంటలంటే మహా ఇష్టం. డిగ్రీ పూర్తయిన తర్వాత గుప్తతో వివాహం జరిగింది. ఢిల్లీలో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓవైపు ఉపాధ్యాయురాలిగా పని చేస్తూనే కుటుంబాన్ని చూసుకునేవారు. భర్తకు వ్యాపారంలో సాయం చేసేవారు మధులిక. పిల్లలు పెద్దవాళ్లై, చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాక ఒంటరితనం ఆమెను వెంటాడింది. అది తీవ్ర కుంగుబాటుకు దారి తీసింది. దీన్ని ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అని వైద్యులు తేల్చారు.