స్కూల్ ఫీజు కట్టలేని స్థితి నుంచి.. ’70 కోట్ల టర్నోవర్’ స్థాయికి.. నిజామాబాద్ జిల్లా రైతు సక్సెస్‌’పూల’ స్టోరీ..!

Nizamabad Farmer Flower cultivation: కడుపేదరికం.. వ్యవసాయమే జీవనాధారం.. కానీ పంటలు పండకపోవటంతో కుటుంబ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదో తరగతి చదువుతున్న తాను స్కూల్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో చదువు మానేశాడు. కుటుంబానికి సాయంగా ఉండాలని భావించాడు. ఆరోజున నెలకు వెయ్యి రూపాయలు జీతమొచ్చే పనిలో చేరిన ఆ కుర్రాడు.. నేడు సుమారు 200 మందికి పైగా జీవనోపాధి కల్పింటమే కాదు.. సంవత్సరానికి 70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. ఇది ఎక్కడో చందమామ కథల్లోనో.. పాశ్చాత్య దేశాల్లో జరిగిన స్టోరీనో కాదు.. అచ్చంగా మన తెలంగాణ కుర్రాడి సక్సెస్ పూల స్టోరీ.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ పేద రైతు కుటుంబంలో పుట్టాడు శ్రీకాంత్ బొల్లపల్లి. వ్యవసాయాధారిత కుటుంబమే అయినా.. సాగు పెద్దగా కలిసిరాలేదు. చదువుకుని ఉద్యోగం చేయాలని ఆశించాడు. కానీ.. కుటుంబం ఉన్న పరిస్థితుల్లో.. ఫీజు కట్టే పరిస్థితి లేక పదో తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. అటు పేదరికం, ఇటు పెరిగిపోతున్న అప్పులు.. కష్టాల్లో ఉన్న కుటుంబ పరిస్థితి.. ఇన్నా అన్నింటి మధ్య.. తాను ఏదో పని చేయకతప్పలేదు. దీంతో16 ఏళ్లకే (1995లో) పని చేయటం ప్రారంభించాడు శ్రీకాంత్. తమకు తెలిసిన బంధువులు పనిలో పెట్టిస్తానంటూ బెంగళూరుకు వెళ్లాడు. అక్కడ ఓ పూల తోటలో నెలకు వెయ్యి రూపాయల జీతంతో పనికి కుదిరాడు.

అక్కడ.. తనకు పని చేయటం పెద్దగా భారంగా అనిపించలేదు. తనది వ్యవసాయ కుటుంబమే కావటంతో.. అక్కడ పూల సాగును చూసి.. మళ్లీ వ్యవసాయం చేయాలన్న కోరిక మొదలైంది. అయితే.. అందుకు కావాల్సిన మెళకువలను పని చేస్తూనే నేర్చుకున్నాడు శ్రీకాంత్. పూలసాగుతో పాటు కోత, మార్కెటింగ్, ఎగుమతి ఇలా అన్ని అంశాల పట్ల ఓ పట్టు తెచ్చుకున్నాడు. ఇక.. అక్కడ పని మానేసి.. తానే స్వయంగా వ్యాపారం మొదలుపెట్టాడు.

మొదట.. చాలా తక్కువ పెట్టుబడితో రైతుల నుంచి పూలు సేకరించి వాటితో వ్యాపారం చేశాడు. 1997లో నగరంలోనే ఓ చిన్న పూల దుకాణం పెట్టాడు. అలా పదేళ్లు పనిచేసిన శ్రీకాంత్.. పూల పెంపకందారులు, పరిశ్రమలో ఉన్న చాల మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో.. పదేళ్ల పాటు కష్టపడి దాచుకున్న డబ్బుకు, ఆత్మవిశ్వాసాన్ని జోడించి.. సొంతంగా పూలసాగులోకి దిగాడు.

వ్యవసాయంలో ప్రధానంగా వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఎన్నో సవాళ్లు విసురుతుంటాయి. వాటన్నింటినీ.. ధైర్యంగా ఎదుర్కొంటూ.. దృఢ సంకల్పం, సహనమే తన విజయానికి పూలబాటగా మారాయని శ్రీకాంత్‌ చెప్తున్నాడు. తన సాగు అంతా సేంద్రీయంగా ఉంటుందనీ.. గ్రీన్‌హౌస్‌లు, పాలీహౌస్‌లలో సేంద్రీయంగా పూలను పెంచుతానని వివరిస్తున్నాడు. దేశవ్యాప్తంగా తనకు కస్టమర్లు ఉన్నారని.. ఏడాదికి 70 కోట్ల టర్నోవర్‌ను సాధిస్తున్నట్టు శ్రీకాంత్ గర్వంగా చెప్తున్నారు. అంతేకాకుండా.. తన వ్యాపారంలో సుమారు 200 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పుకొచ్చారు శ్రీకాంత్.


About amaravatinews

Check Also

రైతులకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. రాయితీపై ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు

తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో తీపి కబురు చెప్పింది. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణ మాఫీ, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *