తెలంగాణలో రహదారుల విస్తరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాయి. హైదరాబాద్-విజయవాడ హైవేను 4 నుంచి 6 వరుసలుగా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక హైదరాబాద్-బెంగళూరు హైవేను కూడా విస్తరించేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో హైవే విస్తరణ పనులు చేపట్టనున్నారు. నిజామాబాద్-జగ్దల్‌పూర్ 63వ నెంబర్ నేషనల్ హైవే విస్తరణ చేపట్టనున్నారు. ఈ హైవే విస్తరణలో కీలకమైన అలైన్‌మెంట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. భూ సేకరణకు వీలుగా తాజాగా ప్రజాప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు.
నిజమాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి జగిత్యాల మీదుగా ఈ హైవే విస్తరణ చేపట్టనున్నారు. మంచిర్యాల సెక్షన్ పరిధిలో 131.8 కిలోమీటర్ల మేర 4 వరుసలుగా విస్తరించేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మెట్‍పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్షెట్టిపేట, హాజీపూర్ పట్టణాల నుంచి గతంలో సర్వే నిర్వహించారు. అయితే ఆ మార్గాల్లో దుకాణాలు, ఆలయాలు, జనావాసాలు ఉండటంతో అభ్యంతరాలు వచ్చాయి. దీంతో అధికారులు రహదారిని బైపాస్ చశారు. అందుకు సంబంధించిన సర్వే పనులు ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు రెడీ అయ్యారు.
నాలుగు వరుసల హైవే విస్తరణ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఆగస్టు 5న లక్షెట్టిపేటలో ప్రజాభిప్రాయ సేకరణకు నిర్వహించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రాజెక్టు డైరెక్టర్ కె.ఎన్.అజయ్ మణి కుమార్ ఆధ్వర్యంలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములతో పాటు ఫారెస్ట్ భూములు రహదారి భూ సేకరణలో ప్రభావితం కానున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని ప్రభావితం చేసే సామాజిక, ఆర్థిక అంశాలను విస్తరణ ప్రాజెక్టు అధికారులు పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటికి ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలు, అభ్యంతరాలపై చర్చించనున్నారు.
ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతుల అనంతరం అధికారులు చర్యలు తీసుకోనున్నారు. అన్ని సమస్యలు పరిష్కారం అయితే త్వరలోనే రహదారి విస్తరణ పనులు ప్రారభం కానున్నాయి. రహదారి పనులు పూర్తయితే పలు జిల్లాల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది.