ఐటీ ఉద్యోగులకు అలర్ట్..అటెండెన్స్‌తో లీవ్స్‌కి లింక్

IT Employees: దేశీయ మూడో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి కంపెనీ హెచ్‌సీఎల్ టెక్ (HCL Tech) మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఆఫీసు అటెండెన్స్‌తో సెలవులకు లింక్ పెట్టింది. అంటే ఆఫీసుకు వచ్చిన వారికి మాత్రమే లీవ్స్ ఉంటాయి. ఆఫీసుకు రాని వారికి శాలరీలో కోత పడనుంది. ఈ మేరకు ఈ విషయానికి సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు మనీకంట్రోలో ఓ కథనం ప్రచురించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు వివిధ రకాల చర్యలు చేపట్టాయి. హైబ్రిడ్ విధానంలో మూడు రోజులు ఆఫీసు రావాలని చాలా కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. వాటిల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సైతం ఉంది. ఇప్పుడు వారానికి మూడు రోజుల ఆఫీసు పనిని కచ్చితంగా అమలు చేసేందుకు కొత్త పాలసీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఉద్యోగుల ఆఫీసు అటెండెన్స్‌తో లీవ్స్‌కి లింక్ పెట్టిందని సమాచారం.

హెచ్‌సీఎల్‌ టెక్ కొత్త పాలసీ ప్రకారం ఉద్యోగులు వారానికి మూడు రోజులు అంటే నెలకు కనీసం 12 రోజుల పాటు ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఒక వేళ కనీస రోజులు ఆఫీసుకు రాలేకపోయినట్లయితే సదరు ఉద్యోగి ఎన్ని రోజులు రాలేదో అన్ని రోజులు లీవ్స్‌లో కోత పడుతుందని కంపెనీకి చెందిన ఓ ఉన్నతాధికారి చెప్పినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. అంటే 12 రోజులు కాకుండా 10 రోజులే ఓ ఉద్యోగి ఆఫీసుకు వచ్చాడు అనుకుందాం. అప్పుడు అతడి లీవ్స్‌లో రెండు రోజులు కోత పడుతుంది.

హెచ్‌సీఎల్ టెక్ కంపెనీ వారానికి మూడు రోజుల పనితో హైబ్రిడ్ మోడ్ తీసుకొచ్చిన 5 నెలల తర్వాత ఈ కొత్త పాలసీని తీసుకురావడం గమనార్హం. ఇప్పటికే హెచ్‌ఆర్ విభాగం ఉద్యోగులకు ఇ-మెయిల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు సమాచారం. ఈ వారం నుంచి ఈ కొత్త పాలసీ అమలులోకి రానుందట. హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగులు 3 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీస్ ఉన్న వారికి 18 యాన్యువల్ లీవ్స్, ఒక పర్సనల్ లీవ్ ఉంటుంది. 3 ఏళ్లకుపైగా పని చేస్తున్న ఉద్యోగులకు 20 యాన్యువల్ లీవ్స్, రెండు పర్సనల్ లీవ్స్ ఉంటాయి. కొత్త పాలసీ ప్రకారం ఈ లీవ్స్‌లో కోత పడుతుంది. దీంతో లీవ్స్ అయిపోతే లాస్ ఆఫ్ పే అవుతుంది. ఈ భయంతోనైనా ఉద్యోగులు ఆఫీసుకు వస్తారని హెచ్‌సీఎల్ టెక్ భావించినట్లు అర్థమవుతోంది.

About amaravatinews

Check Also

మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీ కోర్టు నోటీసులు.. ఎందుకంటే…

ఎంపీగా ప్రమాణం చేసిన రోజు జై పాలస్తీనా అని నినాదాలు చేసినందుకు మజ్లిస్‌ ఎంపీ ఒవైసీకి యూపీలోని బరేలి కోర్టు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *