ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒంగోలులో వైసీపీకి మరో షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది కార్పొరేటర్లు, ఇద్దరు కో ఆప్షన్ మెంబర్లు వైసీపీ కండువాను మార్చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులుగా ముద్రపడిన వారంతా జనసేన చేరారు. బాలినేని ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు కార్పొరేటర్లు.
ఒంగోలు డిప్యూటీ మేయర్ వెలనాటి మాధవ్‌తో పాటు పార్టీ మారిన వాళ్లంతా బాలినేనికి అనుచరులుగా ఉన్నవాళ్ళే. 6 నెలల క్రితం మేయర్ గంగాడ సుజాత, మరో డిప్యూటీ మేయర్‌తో సహా 19 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరగా… ఇప్పుడు 20 మంది వైసీపీ కార్పోరేటర్లు జనసేనలోకి వెళ్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో YCPకి 43 మంది బలముంటే.. ఇప్పుడా పార్టీలో నలుగురు మాత్రమే మిగిలారు.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. YCP నుంచి 41 మంది గెలిచారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరు కూడా YCPలోనే చేరారు. అప్పుడు TDPకి 6, జనసేన 1 కార్పొరేటర్ ఉండేవారు. ఇప్పుడు మారిన సమీకరణాలతో YCPకి నలుగురు మాత్రమే మిగులుతున్నారు. టీడీపీ బలం 25కి పెరిగితే.. జనసేనకు 21 మంది సభ్యులున్నారు. దీంతో కార్పొరేషన్‌పై కూటమికి పట్టు దక్కింది.
మరోవైపు కాకినాడ జిల్లా తునిలో కూడా కౌన్సిలర్లు వైసీపీకి షాక్ ఇచ్చారు. ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు సైకిలెక్కారు. యనమల సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో మొత్తం 28 మంది కౌన్సిలర్లు ఉండగా, 15 మంది టీడీపీలో చేరారు. ఇప్పటికే మెజార్టీ కౌన్సిలర్లు టీడీపీలో చేరగా, మరికొందరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు తుని చైర్ పర్సన్ పదవికి సుధారాణి రాజీనామా చేశారు. తమ కౌన్సిలర్లను టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నందుకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. స్వచ్ఛందంగానే పదవిని వదిలేస్తున్న.. ఇకపై సాధారణ కౌన్సిల్ సభ్యురాలిగా కొనసాగుతానని అన్నారు సుధారాణి.