మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. ఒక్క ట్వీట్‌తో అపాయింట్‌మెంట్..

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బిజీ షెడ్యూల్ ఉండే చంద్రబాబు.. ఇటీవలే ఓ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఆగస్ట్ 13వ తేదీ కలుద్దామంటూ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అన్నట్లుగానే ఇవాళ మధ్యాహ్నం వారితో భేటీ అయ్యారు. అయితే సీఎం అపాయింట్‌మెంట్ కోరింది మరెవరో కాదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, సంఘసేవకురాలు సునీతా కృష్ణన్. సునీతా కృష్ణన్ ట్విట్టర్ వేదికగా అపాయింట్‌మెంట్ అడగగానే ఓకే చేసిన చంద్రబాబు.. చెప్పిన విధంగానే మంగళవారం ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తన ఆటోబయోగ్రఫీ ‘IAm What IAm’ పుస్తకాన్ని సునీతా కృష్ణన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహూకరించారు. అలాగే మానవ అక్రమ రవాణాను నివారణకు కలిసి కృషి చేద్దామని సూచించారు.

చంద్రబాబుతో మీటింగ్ విషయాన్ని సునీతా కృష్ణన్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన సునీతా కృష్ణన్ .. మీటింగ్‌లో సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే తనకోసం విలువైన సమయాన్ని కేటాయించినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఇటీవలే చంద్రబాబు అపాయింట్‌మెంట్ కోరారు సునీతా కృష్ణన్. అపాయింట్‌మెంట్ ప్రయత్నించినప్పటికీ కుదరలేదంటూ.. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు ట్వీట్ చేశారు. అందుకే ట్వీట్ ద్వారా కోరుతున్నానని.. ఏమీ అనుకోకుండా మీ బిజీ షెడ్యూల్‌లో ఓ పది నిమిషాలు నాకు కేటాయించండి సర్ అంటూ ట్వీట్ చేశారు. దీనికి క్షమించాలని పేర్కొన్నారు.

అయితే సునీతా కృష్ణన్ ట్వీట్‌కు కేవలం గంటల వ్యవధిలోనే చంద్రబాబు స్పందించారు. ఆగస్ట్ 13వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కలుద్దామంటూ బదులిచ్చారు. తన బృందం మిమ్మల్ని సంప్రదిస్తుందని హామీ ఇచ్చారు. ఇక చెప్పిన విధంగానే ఇవాళ మధ్యాహ్నం సునీతా కృష్ణన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. సైబర్ ఎనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఉమ్మడి పోరు గురించి సునీతా కృష్ణన్, చంద్రబాబు చర్చించారు. అలాగే సెక్స్ అఫెండర్స్ రిజిస్ట్రీపై చర్చించారు. అయితే ఒక్క ట్వీట్‌కే సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వడం.. ఇచ్చిన హామీ ప్రకారం సమయం కేటాయించడంపై హర్షం వ్యక్తమవుతోంది.

About amaravatinews

Check Also

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలే.. కట్ చేస్తే.. కేక్ పట్టుకొని..

సంవత్సరం అయినా సమస్య పరిష్కరించలేదని అధికారుల తీరుకు నిరసనగా.. అమలాపురం కలెక్టరేట్లో బాధితుడు కేక్ కట్ చేసేందుకు వచ్చాడు. పిర్యాదు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *