కాశ్మీర్ పర్యటనకు వెళ్లిన విశాఖపట్నం పాండురంగపురం కు చెందిన మూడు కుటుంబాలపై పెహల్గాం లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి (70) కుటుంబంతో పాటు మరో రెండు జంటలు కలిసి ఈ నెల 18న టూర్‌కు బయల్దేరారు. అయితే పర్యటన మధ్యలో ఏర్పడిన అనూహ్య పరిస్థితులు ఆ కుటుంబాలను విడదీసి, భయాందోళనలో ముంచెత్తాయి.
చంద్రమౌళి జంట ఉన్న ప్రాంతంలో ముష్కరులు కాల్పులకు తెగబడ్డట్టు సమాచారం. దాంతో ఆయన మిస్ అయినట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆరు మందిలో చంద్రమౌళి కనిపించకపోవడంతో ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. ఈ తరుణంలో మిగతా కుటుంబ సభ్యులు చెల్లాచెదురుగా ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నాల్లో భాగంగా బయటపడ్డారు.
తాజాగా అందిన వివరాల ప్రకారం ముష్కరులు పారిపోతున్న చంద్రమౌళిని వెంటాడి విచక్షణారహితంగా కాల్చి చంపినట్టు తెలుస్తోంది. “మమ్మల్ని వదిలేయండి” అంటూ వేడుకున్నా ముష్కరులు వినిపించుకోలేదని, మోడీకి చెప్పుకోండి అంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్టు పక్కనే ఉన్న టూరిస్టులు చెబుతున్నారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించినట్లు సమాచారం.
ఈ ఘటనతో విశాఖలో విషాదఛాయలు అలముకున్నాయి. పెహల్గాం నుంచి బయలుదేరిన ఆ కుటుంబాల సభ్యులు సురక్షితంగా బయటపడ్డప్పటికీ, చంద్రమౌళి మరణం వారిని తీవ్రంగా కలిచివేసింది. ఆ కుటుంబాలకు మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన అవసరం స్పష్టమవుతోంది.