Paris Olympic Games 2024: ఎన్నో ఆశలతో పారిస్ 2024 ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టిన భారత్ ఇప్పటివరకు అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈసారి ఎలాగైనా రెండంకెల పతకాల మార్కును చేరుకోవాలని పట్టుదలతో ఒలింపిక్స్ బరిలో నిలిచిన భారత్.. ఇప్పుడు అది సాధిస్తుందా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. షూటింగ్ మినహా మరే ఈవెంట్‌లలోనూ భారత అథ్లెట్లు రాణించలేకపోయారు. భారత్ ఇప్పటివరకు మూడు పతకాలు సాధించగా.. అందులో రెండు మను భాకర్ ఖాతాలోనే ఉన్నాయి. మిగతాది కూడా షూటింగ్‌లో దక్కిందే.
వాస్తవానికి పారిస్‌లో భారత్ పది పతకాలకు మించి సాధిస్తుందని అంతా భావించారు. కానీ పోటీలు పదో రోజుకు ప్రవేశించినా.. ఆ సంఖ్య మాత్రం మూడు దగ్గరే ఆగిపోయింది. పతకాల పంట పండిస్తారనుకున్న ఆర్చరీ, బాక్సింగ్, బ్యాడ్మింటన్‌లలో మన క్రీడాకారులు దారుణంగా విఫలమయ్యారు. గత ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధు, బాక్సర్ లవ్లీనా బోర్గెహోయిన్‌లు ఈసారి మాత్రం పతకం సాధించకుండానే నిష్క్రమించారు. ఇక అథ్లెట్ల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వారి కనీస క్వాలిఫికేషన్ రౌండ్స్ కూడా దాటలేకపోయారు. పతకాల్లో పదో రోజు నాటికి భారత్‌కు కాస్త ఉపశమనం కలిగించే అంశం ఏదన్నా ఉందంటే.. అది పురుషుల హాకీ జట్టే.
గత టోక్యో 2020 ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు.. ఈసారి కూడా జోరు కనబరుస్తోంది. క్వార్టర్ ఫైనల్స్‌లో గ్రేట్ బ్రిటన్‌ను ఓడించి సెమీ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగే సెమీ ఫైనల్‌లో గెలిస్తే.. స్వర్ణం లేదా రజతం ఖాయం అయినట్లే. హాకీలో ఈ ఎడిషన్‌లో ఇప్పటికీ పతకం ఖరారు కానప్పటికీ మనోళ్ల జోరు చూస్తే మాత్రం.. మెడల్ పక్కా దక్కేలా ఉంది.
పారిస్ 2024 ఒలింపిక్స్‌సో నేటి నుంచి రెజ్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయి. సోమవారం నిషా దహియా బరిలోకి దిగనుంది. మంగళవారం నుంచి మిగతా స్టార్ రెజ్లర్లు వినేశ్ పొగాట్, అంతిమ్ పంగల్‌లు కూడా పట్టు పట్టేందుకు సిద్ధమయ్యారు. రెజ్లింగ్‌లో గత కొన్నేళ్లుగా భారత క్రీడాకారులు మంచి ప్రదర్శన చేస్తున్నారు. ఈసారి కూడా మన మల్లయోధులు అదే జోరు కొనసాగించి.. పారిస్‌లో పతకాల పంట పండించాలని.. యావత్ భారతావని కోరుకుంటోంది.